
ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
చుంచుపల్లి: విద్యానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆరోపణలు వచ్చిన అద్విత ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం ప్రోగ్రామ్ ఆఫీసర్ మధువరణ్, సిబ్బంది సందర్శించారు. నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమైందని గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. కనీస ప్రమాణాలను పాటించని ఆస్పత్రులు, క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో మహ్మద్ ఫయాజ్ మొహియుద్దీన్ ఉన్నారు.
కుక్కలను
తీసుకొచ్చిన ట్రాలీ..
● పట్టుకున్న గ్రామస్తులు
అశ్వారావుపేటరూరల్: ఇతర ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తీసుకొచ్చి తమ ప్రాంతంలో వదిలేస్తున్నారనే అనుమానంతో ఓ ట్రాలీ ఆటోను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన ఓ వ్యక్తి ట్రాలీ ఆటోలో నాలుగు కుక్కలను గొలుసులతో బంధించి స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర బజార్ సమీపంలో వదిలేందుకు యత్నించాడు. గమనించిన కొందరు స్థానికులు కుక్కలతో ఉన్న ట్రాలీ ఆటోను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి.. స్థానిక మున్సిపాలిటీ సిబ్బందికి ట్రాలీ ఆటోను అప్పగించారు. కాగా, మున్సిపాలిటీ అధికారుల విచారణలో సదరు వ్యక్తి పెంపుడు కుక్కలను పోషించ లేక ట్రాలీ ఆటోలో తీసుకొచ్చి వదులుతున్నట్లు గుర్తించారు. అనంతరం ట్రాలీ ఆటోను వదిలేసినట్లు అధికారులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని రిక్షాకాలనీకి చెందిన వివాహిత అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. రిక్షాకాలనీకి చెందిన గుడివాడ లక్ష్మి (42) కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. మూడు రోజుల క్రితం తన పిల్లలను చూసుకోవాలని కోరుతూ తన అన్నయ్యకు సూసైడ్ నోట్ రాసింది. నోట్ చూసిన పిల్లలు తల్లికి సర్ది చెప్పారు. మనస్తాపం చెందిన ఆమె మంగళవారం మధ్యాహ్నం భర్త శ్రీనివాస్, ఇద్దరు కుమారులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గోదావరిలో దూకిన వ్యక్తి..?
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి వంతెన పైనుంచి ఓ వ్యక్తి దూకినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. వైట్ షర్ట్, ప్యాంట్ ధరించిన సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నదిలో దూకిన్నట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
గంజాయి సేవిస్తున్న
వ్యక్తులపై కేసు
ములకలపల్లి: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. కొందరు గంజాయి సేవిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం కంపగూడెం క్రాస్‌రోడ్డు వద్ద దాడులు నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన సన్యా ముస్తాకిమ్, బిహార్‌కు చెందిన సర్వేశ్‌కుమార్‌తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
చికిత్స పొందుతున్న రైతు మృతి
పాల్వంచరూరల్: కడుపునొప్పి తాళలేక ఏడు రోజుల క్రితం చేనులో పురుగుమందు తాగిన రైతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లికి చెందిన రైతు భూక్యా ప్రసాద్ (36) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 9వ తేదీన చేనులో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్‌ను కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనంపై ఉల్వనూరు పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అదే ద్విచక్రవాహనంపై పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రి సీజ్