
బొప్పాయి సాగుకు నగదు ప్రోత్సాహకం
జూలూరుపాడు: బొప్పాయి సాగు చేస్తే ఎకరానికి రూ. 12 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జె.కిషోర్ అన్నారు. బొప్పాయి సాగు చేసిన జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల రైతులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోగా తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొప్పాయి తోటలకు ఎంఐడీహెచ్ పథకం ద్వారా 40 శాతం సబ్సిడీ, ఎకరానికి రూ.12వేల ప్రోత్సాహకం అందించనున్నట్లు చెప్పారు. ఎకరం విస్తీర్ణంలో 1,234 మొక్కలు అవసరమని, తొమ్మిది నెలల్లో దిగుబడి వస్తుందని తెలిపారు. ఎకరానికి 30 టన్నుల మేర దిగుబడి ఉంటుందని చెప్పారు.
ఇసుక లారీ ఢీకొని
దంపతులకు గాయాలు
దుమ్ముగూడెం : మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. బండిరేవు గ్రామానికి చెందిన గాలి అచ్చుతరావు–స్వరూప దంపతులు తమ గ్రామం నుంచి భద్రాచలం వెళ్తుండగా చిన్ననల్లబల్లి గ్రామంలో ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వరుసగా వస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు నిలిపివేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇసుక లారీలను పంపించారు.
కారు, లారీ ఢీ : ఒకరికి గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రధాన రహదారిపై కారు, లారీ అదుపు తప్పి ఢీకొని రహదారి వెంబడి పొలాల్లోకి దూసుకుపోయాయి. ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 108లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.