
ఫలించిన రైతుల భగీరథ ప్రయత్నం
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు ఆయకట్టు రైతుల భగీరథ ప్రయత్నం ఫలించింది. చెరువు తూముల షట్టర్లు మరమ్మతులకు గురై నిండు కుండలా ఉన్నా చెరువు రెండు షట్టర్లు లేవక నీరు రాక ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలు తీరాయి.తుమ్మలచెరువు అలుగు తూము షట్టరును సోమవారం మెకానిక్ కొమ్ము మల్లయ్య, కొమ్ము వీరయ్య, కల్లెం భీష్మారెడ్డి సహకారంతో రైతులు షట్టరును ఎత్తారు. నీటిపారుదల శాఖ అధికారులు, గజ ఈతగాళ్ల వల్ల సాధ్యకాని పనిని మెకానిక్ కొమ్ము మల్లయ్య చైన్ బ్లాక్ సాయంతో పట్టు వదలకుండా రైతుల సహకారంతో తుమ్మలచెరువు ప్రధాన తూము, అలుగు తూము షట్టరులు లేపి రైతులకు నీరు అందించాడు. భీష్మారెడ్డి సాహసంతో 20 అడుగుల నీళ్లలో మునిగి షట్టరుకు లంగర్ వేయగా చైన్‌బ్లాక్‌తో షట్టరును పైకి ఎత్తారు. రెండు రోజుల క్రితం కొమ్ము మల్లయ్య ప్రధాన తూమును లేపాడు. దీంతో ఆయకట్టు రైతులు కొమ్ము మల్లయ్య, వీరయ్య, భీష్మారెడ్డిని అభినందించారు.
పట్టువదలని విక్రమార్కులు మల్లయ్య, వీరయ్య, భీష్మారెడ్డి