
భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
మణుగూరు టౌన్: భూ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకోవడంతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లంపాడులోని తాటికుంట చెరువు సమీపంలో చల్లా పెద్ద రాములుకు 14 ఎకరాలు ఉండగా, 5.10 ఎకరాల పట్టా భూమి చల్లా ఆయన పేరుతోనే ఉందని ఒక వర్గానికి చెందిన చల్లా సుమతి తెలిపారు. 8.30 ఎకరాల గెట్టు భూమి అన్నదమ్ముల పేరిట ఉందని, 2016లో పెద్ద రాములు మృతి చెందాడని పేర్కొన్నారు. పెద్ద రాములు బతికి ఉన్న సమయంలో కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆ భూమి తమదేనని అంటున్నారని వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సర్వే చేస్తుండగా కొందరు అడ్డుకుని దాడులు చేశారని తెలిపారు. సదరు భూమిని ప్రస్తుతం మణుగూరు ఓసీ విస్తరణలో సింగరేణి తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఆ భూమిని తాము 22 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని మరో వర్గానికి చెందిన తమ్మిశెట్టి వెంకటనర్సు కుటుంబ సభ్యులు తెలిపారు. శిస్తు కట్టడంతోపాటు, సొసైటీకి ధాన్యం విక్రయించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో సర్వే చేస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాగా ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన చల్లా నర్సయ్య, చల్లా తిరుపతిరావు, మౌనిక, మల్లేశ్‌లతో పాటు తమ్మిశెట్టి వెంకటనర్సు, కుటుంబ సభ్యులు మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సీఐ నాగబాబును వివరణ కోరగా.. ఇరువర్గాల ఫిర్యాదులతో 17 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
17 మందిపై కేసు నమోదు