నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి

Sep 10 2025 3:33 AM | Updated on Sep 10 2025 3:33 AM

నిర్ల

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి

● ఓ రైతు సహా ఇద్దరు కూలీలు దుర్మరణం ● మిషన్‌ భగీరథ ట్యాంకులో ఊపిరాడక ప్రమాదం

● ఓ రైతు సహా ఇద్దరు కూలీలు దుర్మరణం ● మిషన్‌ భగీరథ ట్యాంకులో ఊపిరాడక ప్రమాదం

చర్ల: నిర్మాణ సమయాన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. వివరాలిలా.. చర్ల మండలం ఉంజుపల్లిలో రూ.29 లక్షల వ్యయంతో మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ నిర్మిస్తుండగా అధికారులు ఈ పనిని సోనీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అప్పగించారు. కాగా, మంగళవారం స్లాబ్‌ పనులు చేస్తున్న క్రమంలో ట్యాంక్‌లోని నీటిని బయటకు తోడేందుకు డీజిల్‌ మోటార్‌ ఏర్పాటు చేశారు. మోటార్‌లో డీజిల్‌, ట్యాంక్‌లో ఏర్పాటుచేసిన సెంట్రింగ్‌ కర్రలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు మొదట లింగాపురంపాడు గ్రామానికి చెందిన నీలం తులసీరాం(38) ట్యాంక్‌లోకి దిగాడు. ఆయన ఎంతసేపటికీ రాకపోవడంతో ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందిన తాటిగడప ఇస్సాకు(43), కాకినాడకు చెందిన అసునూరి అప్పలరాజు(55) ట్యాంకులోకి దిగారు. చాలాసేపటి దాకా వీరు ముగ్గురూ బయటకు రాకపోవడంతో అక్కడున్న కూలీలు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని పత్తి చేనులో పని చేస్తున్న ఉంజుపల్లికి చెందిన కాకా మహేష్‌(38) కూడా ట్యాంక్‌లోకి దిగాడు. వీరు నలుగురూ అందులో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోవడంతో కూలీలు అతికష్టం మీద బయటకు తీసి హుటాహుటిన చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే కాక మహేష్‌, నీలం తులసీరాం మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అసునూరి అప్పలరాజు, తాటిగడప ఇస్సాకును వేర్వేరు అంబులెన్సుల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇస్సాకు మరణించాడు.

గాలి, వెలుతురు లేకనే..

వాటర్‌ ట్యాంకుకు స్లాబ్‌ వేసే సమయంలో అందులో వెలుతురు ఉండేలా లైట్లు, చెడు గాలిని బయటకు పంపిస్తూ బయటి గాలి లోపలికి వెళ్లేందుకు వీలుగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా అమర్చాలి. లోపలికి దిగేవారికి కచ్చితంగా సేఫ్టీ బెల్ట్‌లు ఏర్పాటుచేయాలి. కానీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని కూలీలు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ప్రమాద స్థలాన్ని మిషన్‌ భగీరథ(గ్రిడ్‌) ఈఈ నళిని, డీఈ యేసుబాబు, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాస్‌, ఎంపీడీఓ చంద్రయ్య పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే కూలీలు మృతి చెందినందున వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి1
1/3

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి2
2/3

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి3
3/3

నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement