
‘సమ్మక్క’ చిక్కులు
అడ్డంకులు లేకుండానే..
కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు చూపాలని సూచన సీతారామ రీడిజైన్‌తో ఇల్లెందు, మహబూబాబాద్‌కు మొండిచేయి సమ్మక్క సాగర్ కొత్త ఆయకట్టుగా ఈ రెండింటినీ చూపాలంటున్న రైతులు
సీతారామ తీర్చేనా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని బీడు భూములకు గోదావరి జలాలు అందించేందుకు జే చొక్కారావు దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు పథకాల కింద గోదావరి నదిపై ములుగు జిల్లాలో సమ్మక్క సాగర్, భద్రాద్రి జిల్లాలో సీతమ్మసాగర్ బరాజ్‌లను నిర్మిస్తోంది. ఇప్పటికే సమ్మక్క బరాజ్ పనులు 95 శాతం పూర్తి కాగా సీతమ్మ సాగర్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. అయితే ఈ రెండు బరాజ్‌లకు సంబంధించిన డిజైన్లు, ఆయకట్టు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)కు ఇప్పటివరకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు రాలేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా కృషి చేస్తోంది.
సమ్మక్క బరాజ్‌కు కొర్రీలు..
సమ్మక్క బరాజ్‌కు సంబఽంధించి సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న 4.40లక్షల ఆయకట్టును స్థిరీకరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఇదే ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లోనూ ప్రభుత్వం చూపించింది. దీంతో ఒకే ఆయకట్టును రెండు ప్రాజెక్టుల కింద చూపడంపై సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టుకే పరిమితం చేస్తే సమ్మక్క బరాజ్‌కు సంబంధించిన ప్రాజెక్టు ప్రయోజనాల వ్యయం (కాస్ట్ బెనిఫిట్ రేషియో) తగ్గుతోంది. ప్రస్తుత డీపీఆర్‌లో ఒక రూపాయి ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే కొత్త పాత ఆయకట్టుల ద్వారా రూ.1.67 లాభం వస్తుందని తెలిపారు. కానీ ఎస్సారెస్పీ ఆయకట్టును తొలగిస్తే రూపాయి ఖర్చుకు రూపాయి మేరకు కూడా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో సమ్మక్క బరాజ్ కింద కొత్తగా రెండు లక్షల ఆయకట్టును చూపాలంటూ కేంద్ర జల సంఘం సూచించింది.
రీడిజైన్‌తో అన్యాయం..
ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. అయితే కిన్నెరసాని అభయారణ్యం కారణంగా అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోందంటూ ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. దీంతో ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని బీడు భూములకు గోదావరి నుంచి చుక్క నీరందే పరిస్థితి లేదు. కొత్తగూడెం, వైరా, ఖమ్మం నియోజకవర్గాలకు కూడా పాక్షికంగానే అందుతోంది.
ఉభయతారకంగా..
గోదావరి నీటిని పాకాల మీదుగా బయ్యారం పెద్ద చెరువు, రోళ్లపాడుకు తరలించే అంశంపై మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశారు. ఇప్పుడు సమ్మక్క బరాజ్ విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని సీతారామతో న్యాయం జరగని నియోజకవర్గాలను సమ్మక్క ఆయకట్టు కింద చూపే అంశాన్ని పరిశీలించాలని భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల రైతులు కోరుతున్నారు.
సీతారామ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసినప్పుడు టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ సముద్ర మట్టానికి 216 అడుగుల ఎత్తులో ఉండడంతో గ్రావిటీ ద్వారానే ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించే వీలుంది. అలాగే కొత్తగూడెం, పినపాక, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో సీతారామ కింద ఆయకట్టు లేని మండలాలకు సాగు నీరందించే వీలుంది. అయితే గోదావరి – రోళ్లపాడు మధ్య కిన్నెరసాని అభయారణ్యం కారణంగా ఈ ప్లాన్ అటకెక్కింది. ఇప్పుడు అభయారణ్యంతో చిక్కులు లేకుండా సమ్మక్క బరాజ్ నుంచి రోళ్లపాడుకు నీరు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే సమ్మక్క బరాజ్ నుంచి ఎత్తిపోసిన నీటిని రామప్ప మీదుగా పాకాల చెరువు వరకు తీసుకొస్తున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ పాకాల నుంచి మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువుకు, అక్కడి నుంచి రోళ్లపాడు చెరువుకు తరలించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
సమ్మక్క సాగర్ కింద ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణపై అభ్యంతరాలు