
పర్యాటక హబ్‌గా నేచర్ పార్క్
● నూతన ఒరవడికి ఇల్లెందు నుంచే శ్రీకారం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
ఇల్లెందురూరల్ : సుభాష్‌నగర్‌లోని అటవీశాఖ సహజ వనాన్ని(నేచర్ పార్క్) పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, తద్వారా జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీశాఖ సహజ వనాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. పార్క్ మధ్యలోని కోరగుట్టను అధికారులతో కలిసి అధిరోహించి రోప్‌వే ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. పార్క్ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పర్యాటకుల వినోదం, విశ్రాంతి, భద్రత అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్‌లో పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఇక్కడ ఏర్పాటయ్యే స్టాళ్లు, ఫుడ్ కార్నర్లు, హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సెర్ప్ అధికారులకు సూచించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలు సహజ సిద్ధంగా అద్భుత సౌందర్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ దినేష్, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, డీఈ రాంకిషన్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్‌సింగ్, ఎఫ్‌డీఓ కరుణాకరాచారి, ఎంపీఓ చిరంజీవి, ఏఈ రాజు, ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావు పాల్గొన్నారు.
రోళ్లపాడు పాఠశాల పరిశీలన..
టేకులపల్లి: మండలంలోని రోళ్లపాడు ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, వసతి వివరాలు ఆరా తీశారు. ఒకటి, రెండో తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు తగిన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీచర్ల హాజరు, బోధనా విధానాలను అధికారులు తరచుగా పరిశీలిస్తారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు చిట్టిబాబు, పంచాయతీ సెక్రటరీ రాజు తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోపలకు అనుమంతించొద్దని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, వివిధ పార్టీల నాయకులు నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు, సలిగంటి శ్రీను, ఎస్‌కే సలీం ఉన్నారు.