
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పారాయణదారులకు ఉచిత వసతి, భోజనం
రామాలయంలో ఈనెల 23 నుంచి జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏటా మాదిరిగానే 108 మందిని ఎంపిక చేసినట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. వీరికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గిరిజనులకు ప్రభుత్వ
పథకాలు అందించాలి
బూర్గంపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆది కర్మయోగి అభియాన్ పథకంపై ప్రతిస్పందనాత్మక పాలనా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని నకిరిపేట, కృష్ణసాగర్, ఉప్పుసాక గ్రామాల గిరిజనుల వివరాలు సేకరించాలని మండల లెవెల్ కమిటీ సభ్యులకు సూచించారు. ప్రతీ గ్రామంలో ఎన్జీఓల సహకారంతో అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పథకాల గురించి గిరిజనులకు సమగ్రంగా వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, అధికారులు నాగరాజు, రవి, ఉషారాణి, రాంబాబు, జగదాంబ పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య తప్పదు
కొత్తగూడెంఅర్బన్: అక్రమంగా అబార్షన్లు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో సిజేరియన్ల్లు (సీ సెక్షన్లు)ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. అత్యవసరమైతేనే సీ సెక్షన్లు నిర్వహించాలని, తల్లీ పిల్లల ఆ రోగ్య సంరక్షణకు సాధారణ ప్రసవాలనే ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు స్పందన, మధువరణ్, ప్రసాద్, తేజశ్రీ, ఫైజ్‌మొహియుద్దీన్ పాల్గొన్నారు.
డీఈఓగా నాగలక్ష్మి కొనసాగింపు
చుంచుపల్లి: జిల్లా విద్యాశాఖధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన మరోసారి విముఖత వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం డీఈఓ బాధ్యతలు చూస్తున్న జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి తిరిగి కొనసాగనున్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి జూలైలో ఉద్యోగ విరమణ పొందగా.. ఆ స్థానంలో విద్యాచందనకు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నిర్ణయించగా ఆమె విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఆగస్టు 4న నాగలక్ష్మికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే విద్యాచందనకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా ఆమె డీఈఓ బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగింది. కానీ ఆమె కలెక్టర్‌ను కలిసి ప్రస్తుతం తాను చూస్తున్న బాధ్యతలను వివరించి, డీఈఓగా అదనపు బాధ్యతలు చేపట్టలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో నాగలక్ష్మినే డీఈఓగా కొనసాగించనున్నారు.

రమణీయం.. రామయ్య కల్యాణం