
‘డ్వాక్రా’కు కోక.. బతుకమ్మ కానుక
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రెండు చీరల చొప్పున పంపిణీ ఇందిరమ్మ పేరుతో అందించనున్న సర్కారు ఈనెల 22 నుంచి చీరలు అందించేలా ఏర్పాట్లు జిల్లాలో 2,16,257 మంది మహిళలకు లబ్ధి
జిల్లాకు కేటాయించిన చీరలు, నిల్వ ఇలా..
జిల్లాలోని మహిళా సంఘాలు, సభ్యుల వివరాలు
చుంచుపల్లి : ఈ ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందరికీ కాకుండా పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఇందిరమ్మ చీరల పేరుతో ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఒక్కొక్కరికి రెండు చీరలను ఈనెల 22 నుంచి ఉచితంగా అందించనుంది. చీరల తయారీకి సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వగా.. సుమారు 65 లక్షల మేర చీరలు తయారవుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన మహిళలకు ఒక్కో చీర అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయగా.. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది పొదుపు సంఘాల మహిళలకు చీరలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే అప్పుడు నాసిరకం చీరలు పంపిణీ చేశారంటూ వ్యతిరేకత రాగా, ఈసారి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఒక్కో చీర ధర రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మణుగూరుకు 17 వేలు, అశ్వారావుపేటకు 13 వేల చీరలు చేరగా, మిగితావి ఈనెల 15 నాటికి చేరతాయని అంటున్నారు.
జిల్లాలో 2,16,257 మందికి..
ఈనెల 21 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానుండగా మహిళలకు చీరల పంపిణీకి సర్కారు సమాయత్తమవుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డులో పేరుండి, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఒక చీర చొప్పున ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం మెప్మా, సెర్ప్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలోని సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 471 గ్రామ పంచాయతీల పరిధిలో 2,16,257 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉన్నారు. ఇందులో సెర్ప్ పరిధిలో 1,82,454 మంది, మెప్మా పరిధిలో 33,803 మంది మహిళలు ఉన్నారని లెక్క తేలగా.. వీరికి రెండు చీరల చొప్పున ఇచ్చేందుకు జిల్లా అధికారులు ఇండెంట్ పంపారు. వీరందరికీ 4,32,514 చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జిల్లాకు వచ్చే ఇందిరమ్మ చీరలను నిల్వ చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఆరు గోదాంలను సిద్ధం చేశారు. జిల్లాలో ఈనెల 22 నుంచి 30 వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాకు వచ్చే బతుకమ్మ కానుక చీరలను నిల్వ చేసేందుకు ఆరు గోదాంలను సిద్ధం చేశాం. వీటికి ఇన్‌చార్జ్ అధికారులకు సైతం నియమించాం. ఒక్కో గోదాంలో 30 వేల నుంచి 60 వేల వరకు చీరలు నిల్వ చేస్తున్నాం. ఇప్పటికే 30వేల చీరలు చేరగా, మిగితావి మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతీ మహిళా సంఘం సభ్యురాలికి రెండు చీరలు అందేలా చూస్తాం.
– ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ
గోదాం కేటాయించిన చీరలు
పాత డీఆర్డీఓ ఆఫీస్(కొత్తగూడెం) 55,000
మెప్మా ఆఫీస్(మణుగూరు) 40,000
మున్సిపల్ ఆఫీస్(పాల్వంచ) 45,000
సీఆర్సీ భవనం (ఇల్లెందు) 40,000
ఎంఎస్ ఆఫీస్(భద్రాచలం) 30,000
ఎంఎస్ ఆఫీస్(అశ్వారావుపేట) 30,000
మండల సమాఖ్యలు : 22
గ్రామ సమాఖ్యలు : 981
స్వయం సహాయక సంఘాలు : 22,055
సంఘాల్లోని మహిళా సభ్యులు : 2,16,257

‘డ్వాక్రా’కు కోక.. బతుకమ్మ కానుక

‘డ్వాక్రా’కు కోక.. బతుకమ్మ కానుక