
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ‘తిప్పరి’ అలియాస్ దేవుజీ
ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా కోరుట్ల
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కోరుట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పొలిట్‌బ్యూరో, కేంద్ర మిలటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు.
తీవ్ర నిర్బంధం ఉన్నా, ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. తిరుపతి ఎన్నికతో రెండోసారి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయ్యింది. పీపుల్స్‌వార్ నుంచి కొండపల్లి సీతారామయ్యను తప్పించిన తర్వాత కరీంనగర్ జిల్లా బీర్పూర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
వృద్ధాప్యం పైబడడంతో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతికి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావుకు ప్రియశిష్యునిగా పార్టీలో పేరుంది. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించడమే సముచితంగా ఉంటుందని పార్టీ భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి.
పార్టీ ప్రధాన నాయకులే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, మడావి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌చార్జ్‌తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు.
కమలేశ్ విచారణలో
విజయవాడలోని పోరంకికి చెందిన నాగరాజు అలియాస్ కమలేశ్ ఆలియాస్ రామకృష్ణ మావోయిస్టు పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జూలై 26న ఏపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. వారి విచారణలో మావోయిస్టు కొత్త సారథిగా తిరుపతిని ఎన్నుకున్నట్టు కమలేశ్ వెల్లడించాడని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఇంజినీర్ కావాలనుకొని..
కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిప్పరి వెంకటనర్సయ్య–గంగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడైన తిరుపతి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. 1980లో పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరాడు. అప్పటికే కాలేజీలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి.
ఈ ప్రభావానికి గురైన తిరుపతితోపాటు పలువురు విద్యార్థులపై పోలీసుల నిర్బంధం సాగింది. అయినా, ఇంటర్ పూర్తి చేసి 1982లో కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడా విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. దీంతో డిగ్రీ పూర్తి కాకముందే మల్లోజుల కోటేశ్వర్‌రావు ముఖ్య అనుచరుడు మెట్‌పల్లి మండలంలోని కొండ్రికర్లకు చెందిన సాయిని ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు మరికొందరు అడవి బాట పట్టినట్టు సమాచారం.1984లో బస్తర్‌కు వెళ్లి అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు.
బస్తర్ బాధ్యతలు హిడ్మాకు
కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన తొలి ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుగా పేరున్న మడ్వి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌చార్జ్‌తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. గెరిల్లా దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మాకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల దూకుడుకు బ్రేకులు వేసేపని అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకునే సుక్మా, బీజాపూర్ జిల్లాలతో కూడిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది.
ఒకప్పుడు ఐదువేల మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అత్యధిక సాయుధులు ఈ కమిటీలోనే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో దండకారణ్యం దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. దండకారణ్యం బాధ్యతలు ఇప్పటివరకు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ చూస్తుండగా, ఇక్కడే ఉన్న జనతన సర్కార్ బాధ్యతలు మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా నిర్వర్తిస్తున్నారు. కొత్తగా హిడ్మా ఈ పోస్టులోకి రావడంతో ఆ ఇద్దరికి ఏ విధులు అప్పగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
మిలిటరీ బాధ్యతల్లో మిసిర్ బెహ్రా: కేంద్ర కమిటీలో ముగ్గురు పొలిట్‌బ్యూరో సభ్యులు ఉన్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంతో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు జార్ఖండ్‌కు చెందిన మిసిర్ బెహ్రాకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా అలియాస్ అభయ్ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు.