సర్వే సరే.. సాయమేదీ? | - | Sakshi
Sakshi News home page

కేంద్రం దయ.. మన ప్రాప్తం

Sep 9 2025 8:17 AM | Updated on Sep 9 2025 2:47 PM

అన్నదాతలకు చిల్లిగవ్వా అందని సాయం

కేంద్రం దయ.. మన ప్రాప్తం

సాక్షిప్రతినిది, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కేంద్రం చేయూతతో జరగాల్సిన పనుల్లో ముందడుగు పడడం లేదు. గత ఏడాది భారీ వరదలతో ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. రూ.వందల కోట్ల మేర రైతులు నష్టపోయి ఏడాది దాటినా సర్వేతోనే సరిపెట్టారు తప్ప రూపాయి సాయం కూడా విదిల్చలేదు. అలాగే కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు, క్రూడ్‌ పామాయిల్‌పై సుంకాల తగ్గింపు, ధన ధాన్య యోజనలో భద్రాద్రి జిల్లాకు స్థానం, రఘునాథపాలెం మండలంలో ఎస్టీపీ ప్లాంట్‌ ఏర్పాటుకు నిధులు, సరిపడా యూరియా కేటాయింపులోనూ రిక్తహస్తమే ఎదురవుతోంది. ఈ అంశాలపై ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

యూరియా మంటలు

కేంద్రం నుంచి తగిన రీతిలో యూరియా సరఫరా కాక కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పంపిణీ కేంద్రాల వద్ద బారులు దీరిన రైతులే కనిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 54,825 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమైతే 27,865 మెట్రిక్‌ టన్నులు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోనూ 22,653 మెట్రిక్‌ టన్నులే చేరింది. సెప్టెంబర్‌కు సంబంధించి 5,212 మెట్రిక్‌ టన్నుల కోటా రావాలి. భద్రాద్రి జిల్లాకు ఈ నెలలో 10,014 మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2,600 మెట్రిక్‌ టన్నులు చేరడంతో కొరత ఎదురవుతోంది. ఇంకా 6,677 మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉంది. ఈ క్రమాన మంత్రి తుమ్మల ఇటీవల కేంద్ర మంత్రులను కలిసి సరిపడా యూరియా కేటాయించాలని, నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాషియం, సల్ఫర్‌పై ఇచ్చే రాయితీలు పెంచాలని కోరారు.

ఎస్‌టీపీకి నిధులివ్వరూ..

రఘునాథపాలెం బ్లాక్‌లోని గిరిజన తండాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో సిమెంట్‌ కాంక్రీట్‌ డ్రెయినేజీ నెట్‌వర్క్‌ కోసం డీపీఆర్‌(డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) సిద్ధం చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి మున్నేటికి వదిలేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనికి ఆమోదం లభిస్తే రఘునాథపాలెం బ్లాక్‌ లోని 37 ఆవాసాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నందున గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రోగ్రామ్‌ కింద కేంద్రం ఆమోదించాలని ప్రతిపాదించారు.

ఎయిర్‌పోర్ట్‌పై మరోసారి..

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశాక ప్రతిపాదిత ప్రాంతం ఆచరణీయం కాదని తేల్చారు. కానీ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు, కొత్తగూడెంలోని పరిశ్రమలకు వచ్చివెళ్లే వారి కోసం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరి. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, మరోసారి అధ్యయనం చేశాకే విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడనున్నందున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.

ఆయిల్‌పామ్‌ రైతులకు ఎదురుదెబ్బ

ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. ఈ క్రమాన కేంద్రం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. గతంలో దిగుమతి సుంకం దాదాపు 44 శాతం ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కింది. కానీ ఇప్పుడు సుంకం తగ్గించడంతో రైతులపై ప్రభావం పడనుంది. రైతులను ఆదుకునేలా కేంద్రం స్పందించి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంది.

భద్రాద్రి జిల్లాకు అర్హత లేదా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 7లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ జిల్లా అంతా ఏజెన్సీ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వర్షాధారంగానే సాగు చేస్తారు. చెరువులు, ఇతర నీటి వనరుల ఆధారంగా వరి, తరి పంటలను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం భద్రాద్రి జిల్లాలో వరి 1,61,257.24 ఎకరాల్లో, పత్తి 2,21,344.76 ఎకరాల్లో, మొక్కజొన్న 96,842 ఎకరాల్లో, కందులు 1,881ఎకరాల్లో సాగు చేశారు. రైతులకు అండగా నిలిచేలా పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల, రైతుల సమిష్టీకరణకు మద్దతు అవసరం. ఇందులో భాగంగా జిల్లాను కేంద్రం అమలుచేస్తున్న ధన ధాన్య కృషి యోజన పథకం కింద చేరిస్తే రైతుల సంక్షేమంతోపాటు స్థానికంగా జీవనోపాధి మెరుగవుతుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నందున భద్రాద్రి జిల్లానూ చేర్చాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.

గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో మున్నేరు వరదతో పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం నగరం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని ప్రజలకు అపార నష్టం కలిగింది. అధికారులు చేపట్టిన సర్వేలో దాదాపు రూ.339 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నిర్ధారించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఢిల్లీ బృందం కూడా తమ పర్యటనలో ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. సాయం అందేలా సిఫారసు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చినప్పటికీ ఏడాది దాటినా ఆ ఊసే లేదు.

గతేడాది వరదలపై సర్వేతోనే సరి

కేంద్రం దయ.. మన ప్రాప్తం1
1/1

అన్నదాతలకు చిల్లిగవ్వా అందని సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement