
పర్ణశాల ఆలయం మూసివేత
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూసేశారు. స్వామివారికి మధ్యాహ్నిక, సాయంకాల ఆరాధన, ఆరగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పించి అనంతరం ఆలయ తలుపులు మూసేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ, శుద్ధి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు.
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం, చండీహోమం, విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం పూజ లు చేశారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణ పతి పూజలు చేశాక చండీహోమం జరిపారు. చి వరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమం పూజలోపాల్గొన్న భక్త దంపతులకు అ మ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూ జా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సభ్యులు చందుపట్ల రమ్య, పాపారావు, రామిరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సుధాకర్, శేఖర్ అర్చకులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత..
చంద్రగ్రహణం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలనుంచి మూసివేశారు. సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు.
కొత్తగూడెం, భద్రాచలంలో నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్‌కు సంబంధించి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలం డివిజన్‌కు సంబంధించి భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర సమస్యలు ఉన్నవారు కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్ సెక్షన్‌లో తమ దరఖాస్తులను అందించి రశీదు పొందాలని, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపిప్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.
కిన్నెరసాని నుంచి
నీటి విడుదల
పాల్వంచరూరల్: ఎగువ నుంచి కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, 1000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం నీటిమట్టం 405.50 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.