తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ఫ్యూన్ బస్తీ(సింగరేణి ప్రధాన కార్యాలయం వెనుక ప్రాంతం)లోని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మార్క బ్రహ్మయ్య(75) మంగళవారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలే. వీరిలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న పెద్ద కుమార్తె సిరికొండ రాధిక తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. కాగా, బ్రహ్మయ్యకు కొడుకులు లేని లోటును కుమార్తెలే తీర్చారని స్థానికులు చర్చించుకున్నారు.
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
పాల్వంచరూరల్: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని మందెరకలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాటి అయోధ్య హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. గతేడాది పూసలతండాకు చెందిన బి.సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సంధ్య భర్త, కుటుంబ సభ్యుతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. సోమవారం సంధ్య ఇంటికి వెళ్లి.. గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, సంధ్య తల్లి, కుటుంబ సభ్యులు మంజుల, ఆమె భర్త కుమార్ కారణమని మంగళవారం మృతుడి తండ్రి వీరభద్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్
పాల్వంచ: గంజాయి సేవిస్తున్న ఐదుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాత పాల్వంచ చింతలచెర్వు కట్టపైన గంజాయి తాగుతున్న గాంధీనగర్ ఏరియాకు చెందిన సయ్యద్ సాజిద్‌పాషా, షేక్ సమీర్, షేక్ వసీంలతో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1.750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన మహ్మద్ జూనీమియాకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిందుప్రియ ముంగళవారం తీర్పు చెప్పారు. ముదిగొండ మండలం పెద్దమండవకు తాళ్లూరి శీతయ్య వద్ద జానీమియా 2018 ఆగస్టులో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమాన చెక్కు జారీ చేయగా అది బౌన్స్ అయింది. శీతయ్య కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం జానీమియాకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.2.24క్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.


