మూడోసారీ పైచేయే..
98 సర్పంచ్ స్థానాల్లో విజయం
19 జీపీలకే పరిమితమైన బీఆర్‌ఎస్
కొత్తగూడెం నియోజకవర్గంలో సత్తాచాటిన సీపీఐ
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పంచాయతీ పోరులో మొదటి నుంచీ కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి, రెండో విడతలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు తిరుగులేని మెజారిటీ సాధించగా, మూడో దశలోనే అదే ఉనికి చాటారు. జిల్లాలోని 145 గ్రామపంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకంగా 98 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి రావడంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల ప్రచారం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. దీంతో అధికారంలో ఉన్న పార్టీని పల్లె ఓటర్లు మరోసారి ఆదరించారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెరుగైన ఫలితాలు సాధించారు. కాగా, తుది విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కొంత డీలా పడింది. మొదటి విడతలో 38, రెండో విడతలో 31 గ్రామపంచాయతీలను గెలుపొందిన గులాబీ మద్దతుదారులు మూడో విడత ఎన్నికల్లో 19 స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ బలపర్చిన అభ్యర్థులు 16 పంచాయతీలు దక్కించుకుని సత్తా చాటారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో కాంగ్రెస్‌కు దీటుగా ఫలితాలు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ రెండు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి అభ్యర్థుల విజయం కోసం వారం రోజుల పాటు శ్రమించారు. ఈ రెండు మండలాల్లోనూ కాంగ్రెస్, సీపీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీ పోటీ నెలకొంది. కాగా, సీపీఎం మూడో విడతలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది.
తుది విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా
మూడోసారీ పైచేయే..
మూడోసారీ పైచేయే..
మూడోసారీ పైచేయే..


