‘చివర’కు ఓటెత్తారు..
తుది పోరులో 84.67 శాతం పోలింగ్
అత్యధికంగా సుజాతనగర్‌లో 89.32 శాతం
ప్రశాంతంగా ముగిసిన పల్లె పోరు
మూడో విడతలో
నమోదైన పోలింగ్ వివరాలిలా..
చుంచుపల్లి: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం పెరిగింది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీల్లో బుధవారం చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 84.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సుజాతనగర్‌లో 89.32 శాతం, అత్యల్పంగా ఇల్లెందు మండలంలో 80.64 శాతం మంది ఓటు వేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని సైతం స్వగ్రామాలకు రప్పించారు. మూడో విడతలో 1,75,074 మంది ఓటర్లకు గానూ 1,48,229 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 21.27 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటలకు 62.35 శాతం పోలింగ్, ఓటింగ్ ముగిసే సమయానికి 84.67 శాతం మంది ఓట్లు వేయడం విశేషం.
పలు చోట్ల
12 గంటలకే..
మొదటి విడతలో 71.79 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 82.91 శాతం మంది ఓటేశారు. మూడో విడతలో ఏకంగా 84.67 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకే పోలింగ్ పూర్తిస్థాయిలో ముగిసింది. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఉదయమే ఓటు వేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు ప్రత్యక్షంగా పోలింగ్ సరళిని వీక్షించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు కూడా ఉండడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అనిశెట్టిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎస్పీ రోహిత్‌రాజు కూడా పలు మండలాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. మూడో విడతలో ఎన్నికలు జరిగిన 145 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 470 మంది పోటీపడ్డారు. టేకులపల్లి మండలంలో అత్యధికంగా 112 మంది పోటీ పడగా, సుజాతనగర్ మండలంలో అతి తక్కువగా 32 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాల బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులు మొదట వార్డుల వారీగా, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతల వివరాలు వెల్లడించారు. చివరగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక పూర్తి చేశారు. తుది విడత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి అనుచరులు ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు.
మండలం మొత్తం ఓటర్లు పోలైనవి నమోదు శాతం
సుజాతనగర్ 13,598 12,146 89.32
జూలురుపాడు 24,462 21,700 88.71
ఆళ్లపల్లి 9,314 8,205 88.09
టేకులపల్లి 42,068 36,376 86.47
గుండాల 12,092 10,430 86.02
లక్ష్మీదేవిపల్లి 30,811 24,913 80.86
ఇల్లెందు 42,729 34,459 80.64
మొత్తం 1,75,074 1,48,229 84.67


