రామాలయంలో తిరుప్పావై గోష్టి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులతో పాటు ఆండాళ్ అమ్మవారికి అర్చకులు తిరుప్పావై గోష్టి నిర్వహించారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించడంతో పాటు తిరుప్పావై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కేఈ స్థలశాయి ధన్ముర్మాస విశిష్టతను వివరించారు. తిరుప్పావై వ్రతం ఆచరిస్తే భక్తుల సకల అభీష్టాలు నెరవేరుతాయని, జనవరి 14న గోదా కల్యాణంతో ఈ వేడుకలు ముగుస్తాయని వివరించారు.
సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం వైభవంగా సాగింది. స్వామివార్లకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బుధవారం భద్రాచలానికి చెందిన భక్తురాలు ప్రేమనీల రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్‌ఓ సాయిబాబు పాల్గొన్నారు.
ఆండాళ్ అమ్మవారికి వైభవంగా తిరువీధి సేవ


