చదువుతో పాటు సౌకర్యాలూ కల్పించాలి
అశ్వారావుపేటరూరల్: ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు వసతి, ఇతర సౌకర్యాల కల్పనలో హెచ్‌ఎంలు, వార్డెన్లు బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం, అనంతారం, మేకలబండ గ్రామాల్లో పర్యటించారు. ఉన్నత విద్యనభ్యసించే వారికి వృత్యంతర శిక్షణ అందించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. మేకలబండ జీపీఎస్, అనంతారం ఆశ్రమ పాఠశాలల్లో తరగతి గదులు, వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతీరోజు మెనూ ప్రకారం పౌస్టికాహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా హెచ్‌ఎం, వార్డెన్లు భోజనం చేశాకే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఉద్దీపకం వర్క్‌బుక్ సంబంధిత అంశాలను విద్యార్థులతో బోర్డుపై రాయించారు. అంతకుముందు గాండ్లగూడెంలో పర్యటించి ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన లబ్ధిదారులకు చేరుతున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కొండరెడ్ల జీవనోపాధి పెంపునకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు, హౌసింగ్ ఏఈఈ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంలు, వార్డెన్లకు
ఐటీడీఏ పీఓ సూచన


