‘పంచాయతీ’ ముగిసింది
జిల్లాలో మూడు విడతల్లో కలిపి ఫలితాల వివరాలిలా..
కాంగ్రెస్ 266
బీఆర్‌ఎస్ 88
సీపీఐ 45
సీపీఎం 13
ఇతరులు 56
● మొత్తంగా 78.82 శాతం పోలింగ్ నమోదు ● 40 జీపీలు, 840 వార్డులు ఏకగ్రీవం
చుంచుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. జిల్లాలో తొలి విడతలో 159 జీపీలు, 1,436 వార్డులకు గాను నామినేషన్లు రానివి, ఏకగ్రీవాలు మినహాయించి 145 పంచాయతీలు, 1,097 వార్డులకు, రెండో విడతలో 156 పంచాయతీలు, 1,392 వార్డులకు కోర్టు ఆదేశాలతో నిలిచిన చాపరాలపల్లి పంచాయతీ, ఏకగ్రీవాలు పోను 138 జీపీలు, 1,123 వార్డులు, మూడో విడతలో 156 పంచాయతీలు, 1,340 వార్డులకు గానూ కోర్టు ఆదేశాలతో నిలిచిన జూలూరుపాడు జీపీ, ఏకగ్రీవాలు పోగా 145 పంచాయతీలు, 1,071 వార్డులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో 6,30,539 మంది ఓటర్లకు మూడు విడతల్లో కలిపి 4,97,033 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 78.82 శాతం పోలింగ్ నమోదైంది.
ఏకగ్రీవాలిలా..
మూడు విడతల్లో కలిపి 471 పంచాయతీలకు గాను 40, 4,168 వార్డులకు 840 ఏకగ్రీవమయ్యాయి. పాండురంగాపురం పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్ చేయగా ఆ వర్గం వారు లేరు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదంటూ అక్కడ సర్పంచ్‌తో వార్డు స్థానాలకు కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇంకా అక్కడక్కడా 15 వార్డుల వరకు రిజర్వేషన్ అభ్యర్థులులేక నామినేషన్లు రాలే దు. కోర్టు ఆదేశాల మేరకు చాపరాలపల్లి, జూలూరుపాడులో ఎన్నికలు నిలిచిపోయాయి. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
(జిల్లాలో మొత్తం 471 గ్రామ పంచాయతీలకు గాను ములకలపల్లి మండలం చాపరాలపల్లి, జూలూరుపాడు, పాల్వంచ
మండలం పాండురంగాపురంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరుగలేదు.)


