నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవంగా రుద్ర హోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని గురువారం రుద్రహోమం, అమ్మవారికి సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ చేశాక రుద్రహోమం, చివరకు పూర్ణాహుతి జరిపించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
మణుగూరు రూరల్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన మణుగూరులోని పీహెచ్‌సీని పరిశీలించారు. సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శ్రమదానం – పరిశుభ్రత – పచ్చదనం – సమష్టి భోజనం కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. పీహెచ్‌సీకి వచ్చే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు నిశాంత్‌రావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠు లక్షణాలపై అవగాహన ఉండాలి
పాల్వంచ: కుష్ఠు వ్యాధి లక్షణాలపై అవగాహన ఉండాలని డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ అన్నారు. వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన స్థానిక జయమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పర్శలేని, ఎర్రని, రాగి రంగు మచ్చలు, కాళ్లు మొద్దుబారడం, చేతులకు తిమ్మిరి రావడం వంటి లక్షణాలుంటే వెంటనే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగితే తమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా పారామెడికల్ అధికారి తేజావత్ మోహన్ తదితరులు ఉన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


