శాంతి, కరుణకు ప్రతీక క్రిస్మస్
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఉద్యోగులు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ సందేశమని తెలిపారు. ఈ పండుగను క్రైస్తవులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్క్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మైనార్టీ, ఎస్సీ, మహిళా సంక్షేమాధికారులు సంజీవరావు, శ్రీలత, స్వర్ణలత లెనీనా, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి, టీజీఓస్ జిల్లా అధ్యక్షులు సంగెం వెంకట పుల్లయ్య, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, జిల్లా అధికారులు, పాస్టర్లు ప్రభుదాస్, తిమోతి తదితరులు పాల్గొన్నారు.


