స్పీకర్ చర్య అనైతికం
నేడు భద్రాచలానికి రాక
● ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందే.. ● జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఇల్లెందు/సూపర్‌బజార్(కొత్తగూడెం)/మణుగూరుటౌన్/పాల్వంచరూరల్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చర్య అనైతికమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచలో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను ఇంతకాలం నాన్చి ఇప్పుడు ఆధారాలు లేవంటూ కొట్టివేయడం తగదన్నారు. తనను బీఆర్‌ఎస్ బయటకు పంపిందని, ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. పార్టీ గుర్తులు లేకుండా సాగే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గ్రామపంచాయతీలకు ప్రస్తుతానికి నిధులు లేవని, కొత్త పాలకమండళ్లు కొలువుదీరాక అయినా గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగా.. అమలులో విఫలమైందని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, కనీసం బొగ్గు బ్లాకులు కూడా కేటాయించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌ను తాము ముట్టడిస్తేనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారని చెప్పారు. సంస్థలో విద్య, వైద్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 13 జిల్లాల్లో పర్యటన పూర్తయిందని, ఈ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు.
దర్గా, ఆలయాల సందర్శన
ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలోని హజ్రత్ నాగుల్‌మీరా దర్గాను సందర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా దర్గా అభివృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. ఉర్సు ఉత్సవాల సమయంలో వేల సంఖ్యలో వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆ తర్వాత పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి చీర సమర్పించారు. కొత్తగూడెంలోని స్నేహలత – సంధ్యాలత వృద్ధాశ్రమాన్ని, ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. మణుగూరులోని పద్మగూడెంలో ఇటీవల మరణించిన కారంగుల మల్లీశ్వరి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జాగృతి జిల్లా అధ్యక్షుడు డి.వీరన్నతో పాటు వివిధ సంఘాల నాయకులు లకావత్ సురేష్, రాంబాబు, జగదీష్, మాధవి, రాజేందర్, ఖలీల్, శ్రీకాంత్ , హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కొడిపల్లి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. రామయ్య దర్శనానంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌లో ఐదు విలీన గ్రామపంచాయతీల ప్రజలతో సమావేశం కానున్నారు.


