ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయండి
కిన్నెరసానిలో పనులు పర్యాటకులను ఆకట్టుకోవాలి
రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహరి
పాల్వంచరూరల్ : కిన్నెరసానిలో చేపట్టే ఎకో టూరిజం పనులు పర్యాటకులకు ఆకట్టుకునేలా ఉండాలని రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహరి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కిన్నెరసానిని గురువారం ఆయన సందర్శించారు. డీర్‌పార్కులో జింకలకు పౌష్టికాహారం అందించేందుకు నిర్మించిన ప్లాట్‌ఫారాలను, కాటేజీల నుంచి వాచ్‌టవర్ వరకు నిర్మించిన సీసీ రోడ్డును, డీర్‌పార్కు నుంచి మొండికట్ట వరకు నిర్మించిన సఫారీ రహదారిని పరిశీలించారు. జలాశయంలో బోటు షికారు చేశాక.. కిన్నెరసాని డ్యామ్ వద్ద చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్.డి.భీమానాయక్, డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బి.బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిన్నెరసానిని మరింతగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. వన్యప్రాణులకు వీక్షించేందుకు వీలుగా సంక్రాంతి నాటికి సఫారీ రహదారిని ప్రారంభించాలని సూచించారు.
రూ.50 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు..
ఎకో టూరిజం అభివృద్ధి పనుల నిర్వహణకు రూ.50 లక్షల అంచనాలతో అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహరికి ప్రతిపాదనలు అందజేశామని ఎఫ్‌డీఓ బాబు తెలిపారు. మూడు సఫారీ వాహనాలు త్వరలోనే కిన్నెరసానికి రానున్నాయని, పర్యాటకులను అకట్టుకునేలా ప్రత్యేక బోటు, డ్యామ్‌పై భాగంలో సన్‌సైట్ పాయింట్ ఏర్పాటు, సోలార్ లైటింగ్ సిస్టం తదితర పనులు చేపట్టనున్నామని వివరించారు. కార్యక్రమంలో రేంజర్ కవితా మాధురి, సెక్షన్ అధికారి కిషన్, వైల్డ్‌లైఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


