పల్లె పోరు.. అతివల జోరు
పంచాయతీ పోలింగ్‌లో
మహిళా ఓటర్లే ఎక్కువ
చుంచుపల్లి: జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనేక చోట్ల గెలుపోటములను మహిళా ఓటర్లే శాసించారు. మూడు విడతల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓట్లు వేశారు. ఈనెల 11న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 8 మండలాల పరిధిలోని 145 గ్రామపంచాయతీల్లో 71.79 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో 2,59,070 మంది ఓటర్లకు గాను 1,85,974 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 90,175 మంది కాగా, మహిళలు 95,794 మంది ఉన్నారు. రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 138 పంచాయతీల్లో 82.91 శాతం పోలింగ్ నమోదైంది. 1,96,395 మంది ఓటర్లకు గాను 1,62,826 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 79,442 మంది, మహిళా ఓటర్లు 83,381 మంది ఉన్నారు. చివరి విడతలో ఏడు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీల్లో 84.66 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈ విడతలో 1,75,074 మంది ఓటర్లకు గాను 1,48,215 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 72,908 మంది ఉండగా, మహిళలు 75,305 మంది ఉన్నారు. మూడు విడతల్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు వేయడం విశేషం.
పదవుల్లోనూ వారే..
ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళలకే పెద్దపీట దక్కింది. జిల్లాలో 60 శాతం గ్రామ పంచాయతీల్లో వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాల్లోనే కాకుండా కొన్ని జనరల్ సీట్లలోనూ విజయం సాధించి సత్తా చాటారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో 50 శాతం కోటాను మహిళలకు ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో కూడా పురుషులతో సమానంగా పోటీపడే అవకాశం కల్పించారు. జిల్లాలోని 471 సర్పంచ్ స్థానాల్లో 230 స్థానాలను మహిళలకు కేటాయించారు. మరో 241 పంచాయతీలను పురుషులు/ మహిళలకు ఖరారు చేశారు. వీటిలో అత్యధికంగా 226 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కాయి. ఎస్సీ జనరల్‌కు 02, జనరల్‌కు 05, జనరల్ మహిళలకు 04 స్థానాల చొప్పున కేటాయించారు. జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి 241 మంది మహిళలు సర్పంచ్ పీఠాలను అధిరోహించడం గమనార్హం.


