పదునెక్కిన కత్తెర | - | Sakshi
Sakshi News home page

పదునెక్కిన కత్తెర

Dec 19 2025 8:02 AM | Updated on Dec 19 2025 8:02 AM

పదునె

పదునెక్కిన కత్తెర

జిల్లాలో కత్తెర హవా..

రెండో స్థానానికి పరిమితమైన ‘రింగ్‌’ పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు మెజార్టీ జీపీల్లో బరిలో ఉన్నవి ఐదు గుర్తులే

ఎక్కువ మంది అభ్యర్థులకు గెలుపు అందించిన గుర్తులివే..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత సూక్ష్మ స్థాయిలో జరుగుతాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలతో పోల్చితే ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే ఓటర్ల సంఖ్య చాలా తక్కువ. వార్డుకు సంబంధించి 100కు అటు ఇటుగా ఓటర్లు ఉంటారు. అందుకే పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తారు. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ.. ఆయా పార్టీలకు సంబంధించిన ఎన్నికల చిహ్నాలపై కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ లాటరీ ద్వారా కేటాయించిన గుర్తుల ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో రాజకీయ పార్టీల జోక్యం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉంటుంది.

30 రకాల గుర్తులు

సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల కోసం 30 రకాల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. ఇవి వరుసగా ఉంగరం, కత్తెర, బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడీస్‌ పర్స్‌, టీవీ రిమోట్‌, టూత్‌పేస్ట్‌, స్పానర్‌, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ ఫిల్టర్‌, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, బ్యాట్స్‌మాన్‌, తెరచాప పడవ, బిస్కట్‌, వేణువు, చెయిన్‌, చెప్పులు, గాలిబుడగ, స్టంప్‌లుగా ఉన్నాయి. ఒక గ్రామ సర్పంచ్‌ స్థానానికి రికార్డు స్థాయిలో 30 మంంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఇబ్బంది లేకుండా గుర్తులు కేటాయించవచ్చు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ముగిశాక బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లలో ఆంగ్ల అక్షరమాలను అనుసరించి జాబితాలో 1 నుంచి 30 వరకు ఉన్న గుర్తులను కేటాయించారు. వాటి ఆధారంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేయగా.. పోలింగ్‌ రోజు బ్యాలెట్‌ పేపర్‌పై తమకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.

పోటీలో ఆ ఐదు..

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు దక్కిన వివిధ గుర్తులను పరిశీలిస్తే గెలుపొందిన వాటిలో బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడీస్‌ పర్సు గుర్తులు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మెజారిటీ పంచాయతీల్లో ఐదుగురుకి మించి అభ్యర్థులు సర్పంచ్‌ స్థానం కోసం పోటీ పడలేదు. ఫలితంగా 30 గుర్తులను ఎన్నికల కమిషన్‌ అందుబాటులో ఉంచినా.. జాబితాలో తొలి వరుసలో ఉన్న కత్తెర, ఉంగరం, బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడీస్‌ పర్సు వంటి గుర్తులే ఎక్కువగా అభ్యర్థులకు దక్కాయి. కొత్తగూడెంలో ఫుట్‌బాల్‌ గుర్తు సత్తా చాటింది. గెలుపు దక్కకపోయినా భద్రాచలం పంచాయతీలో లేడీస్‌ పర్సు గుర్తు ప్రచారంలో మంచి ప్రాధాన్యత దక్కించుకుంది. టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీలో ఆరో స్థానంలో ఉన్న టీవీ రిమోట్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థిని విజయం వరించింది.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 471 గ్రామపంచాయతీలకు గాను 40 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. న్యాయపరమైన చిక్కులతో రెండు చోట్ల, నామినేషన్లు దాఖలు కాక ఒక చోట ఎన్నికలు జరగలేదు. మొత్తంగా 428 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కత్తెర గుర్తుపై పోటీ చేసిన వారు ఏకంగా 180 పంచాయతీల్లో విజయం సాధించారు. ఆ తర్వాత స్థానంలో 151 పంచాయతీల్లో గెలుపుతో ఉంగరం (రింగు) గుర్తు ఉంది. గుర్తుల జాబితాలో ఉంగరం తొలి స్థానంలో ఉండగా కత్తెర రెండో స్థానంలో ఉంది. కానీ విజయాల విషయానికి వస్తే కత్తెర ప్రథమ స్థానంలో నిలవగా ఉంగరం ద్వితీయ స్థానానికి పడిపోయింది.

ఆ గుర్తుపైనే ఎక్కువ మంది సర్పంచ్‌ల గెలుపు

నియోజకవర్గం కత్తెర రింగ్‌ బ్యాట్‌ లేడీస్‌పర్స్‌ ఫుట్‌బాల్‌

భద్రాచలం 24 22 11 02 ––

పినపాక 52 34 13 – 04

కొత్తగూడెం 45 41 15 – 11

ఇల్లెందు 19 21 15 04 03

అశ్వారావుపేట 40 33 10 03 04

మొత్తం 180 151 64 09 20

పదునెక్కిన కత్తెర1
1/1

పదునెక్కిన కత్తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement