ఇల్లెందు: ఇల్లెందు కరెంటాఫీస్ ఏరియాకు చెందిన షేక్ రజియాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆదివారం రజియా వివరాలు వెల్లడించారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ కరుణసాగర్ నేతృత్వంలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ లభించిందని తెలిపింది. ఆమెకు డాక్టరేట్ రావడంపై పలువురు అభినందనలు తెలిపారు.
తాళం వేసిన రెండిళ్లలో చోరీ
సుజాతనగర్: తాళం వేసిన రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని బాలాజీనగర్‌లో ఆదివా రం వెలుగుచూసింది. ఎస్‌ఐ రమాదేవి కథనం మేరకు.. బాలాజీనగర్‌లో కూరపాటి రాజేంద్రప్రసాద్, నాయుడు సతీశ్ వేర్వేరు వీధుల్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఇళ్లకు తాళం వేసి కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. రాజేంద్రప్రసాద్ ఇంట్లో 4.4 తులాల బంగారపు వస్తువులు, 44 తులాల వెండి, రూ.30 వేల నగదు, సతీశ్ ఇంట్లో 7 తులాల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అటవీశాఖ సిబ్బందిపై ఫిర్యాదు
దుమ్ముగూడెం: మండలంలోని గడ్డోరగట్ట గ్రామానికి చెందిన పోడు గిరిజనులు అటవీశాఖ సిబ్బందిపై ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలంలో అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్లతో టేకు చెట్లను నరికిస్తుండగా గ్రామస్తులు వెంబడించారు. ఇద్దరు పారిపోగా మరో ఇద్దరు వాచర్లు దొరకడంతో వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యతిరేక సాక్ష్యాలను సృష్టించేందుకు అటవీశాఖ చేసిన కుఠిల యత్నాలు బెడిసికొట్టాయని పలువురు అంటున్నారు. ఈ ఘటనపై సీఐ అశోక్ మాట్లాడుతూ.. కేసు హైకోర్టులో ఉన్నందున.. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పోడుసాగుదారులకు సూచించారు.
బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతి
కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం కొణిజర్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దరాంపురం గ్రామానికి చెందిన ఇనపనూరి నాగేశ్వరరావు అలియాస్ నాగరాజు (33) తన కుమార్తెను ఖమ్మం వైద్యశాలలో చేర్పించి డబ్బుల కోసం ఇంటికి వస్తున్న క్రమంలో బస్వాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఖమ్మం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుష్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లెందువాసికి డాక్టరేట్