
బతుకులు ఆగం చేయొద్దు
● మాడవీధుల విస్తరణకు సహకరిస్తాం
● ప్రత్యామ్నాయం చూపండి.. పరిహారం ఇవ్వండి
● రామాలయ పరిసరాల చిరు వ్యాపారుల వినతి
● నేటి నుంచి ఇళ్లు తొలగించనున్న రెవెన్యూ అధికారులు
భద్రాచలం: ‘దశాబ్దాల తరబడి రాముడిపైనే ఆధారపడి ఉంటున్నాం.. భక్తులు వస్తేనే మాకు పొట్ట నిండేది.. అయినా సరే రాముడిపై భక్తి, ఆలయాభివృద్ధి కోసం ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేస్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిహారం కూడా పూర్తిగా అందలేదు.. ప్రత్యామ్నాయ స్థలమూ చూపించలేదు.. ఇదేం అన్యాయం.. మా బతుకులు ఆగం కాకుండా చూడండి’ అంటూ నిర్వాసితులు గోడును వెల్లబోసుకుంటుచ్చారు.
మేమెక్కడ ఉండాలి..
భద్రాచలం, రామాలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు తొలగించి మాడ వీధుల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు ఇటీవల నష్టపరిహారం అందజేశారు. పరిహారం పూర్తిగా చెల్లించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరామనవమికి ముందు రోజు హడావిడిగా చెక్కులు పంపిణీ చేశారని, అయితే ఆ రోజున మూడో వంతు పరిహారం మాత్రమే అందించారని నిర్వాసితులు అంటున్నారు. మిగిలిన మొత్తం కొద్ది రోజుల్లోనే ఇస్తామని, భూమికి బదులు భూమి అందిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకూ మిగితా డబ్బు ఇవ్వకపోగా ప్రత్యామ్నాయం కూడా చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇళ్లు తొలగిస్తామని అంటున్నారని, మరి తామెక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ప్రత్యామ్నాయం చూపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
స్పష్టత ఇవ్వని అధికారులు..
నిర్వాసితులకు భూమి అందజేసే విషయంలో రెవెన్యూ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ ‘ప్రసాద్’ పనుల్లో భాగంగా బ్రిడ్జి సెంటర్‌లో తొలగించిన ఆర్‌అండ్‌బీ స్థలాన్ని లాటరీ పద్ధతిలో కేటాయిస్తారనే ప్రచారం సాగింది. అయితే సుమారు రెండెకరాల ఈ స్థలం భవిష్యత్‌లో భద్రాచలం, రామాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, నిర్వాసితులకు పురుషోత్తపట్నం లేదంటే పట్టణంలో ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారుల వద్ద ఎలాంటి స్పష్టత లేకపోవడంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖాళీ చేయాల్సిన భవనాల్లోని ఖరీదైన ఫర్నిచర్, కలపను మంగళవారం తరలించారు.

బతుకులు ఆగం చేయొద్దు