
సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 – మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు జరుగుతాయ ని, ఇందుకోసం కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 1,367 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్టుమెంటల్ అధికారులు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 50 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడువాపు, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి శుభ్రం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డీసీహెచ్‌ఎస్ రవినాయక్, జిల్లా మలేరియా అధికారి స్పందన, డీపీఓ చంద్రమౌళి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు ఇందిర, మణెమ్మ, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నళిని, ఏడీఎంహెచ్‌ఓ జయలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి