
ఏసీబీ అధికారినంటూ బెదిరింపు
టేకులపల్లి: ఏసీబీ అధికారినంటూ ఏకంగా తహసీల్దార్‌కే ఫోన్ చేసి బెదిరించి రూ.98 వేలు కాజేసిన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. శనివారం మధ్యాహ్నం 74832 47988 (మంజు గౌరి పేరుతో ఉన్నది) నంబర్ నుంచి తహసీల్దార్ ముత్తయ్యకు ఫోన్ వచ్చింది. ‘ఏసీబీ అధికారిని మాట్లాడుతున్నా.. మీ ఆర్‌ఐ నాకు చిక్కాడు. మీ పేరు చెబుతున్నాడు. కేసులో మీ పేరు కూడా రాస్తా.. కావాలంటే మాట్లాడండి’ అని ఆర్‌ఐతో ఫోన్‌లో మాట్లాడించాడు. రూ.2 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పాడు. అయితే విషయం ఏంటో తెలుసుకోకుండానే భయాందోళనకు గురైన తహసీల్దార్ ఫోన్ చేసిన వ్యక్తికి మొదట రూ.50వేలు, ఆ తర్వాత అర్ధగంట వ్యవధిలో రూ.48 వేలు.. మొత్తం రూ.98 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత ఆర్‌ఐని పిలిచి మాట్లాడితే.. తన వద్దకు ఎవరూ రాలేదని, ఫోన్‌లో మాత్రమే మాట్లాడానని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన తహసీల్దార్ వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ముత్తయ్య మాట్లాడుతూ.. ఈనెలాఖరున తాను రిటైర్డ్ అవుతున్నానని, ఏసీబీ అధికారినని చెప్పగానే కంగారులో ఫోన్ పే చేశానని చెప్పారు. తనకు ఏసీబీ అధికారినంటూ ఫోన్ రావడం అనుమానంగా ఉందని, ఎవరో కుట్ర పన్ని ఇలా చేశారని అంటున్నారు. ఆ తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని చెప్పారు. దీనిపై ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కాగా, ఆర్‌ఐ రత్తయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
రూ.98 వేలు ఫోన్ పే చేసిన తహసీల్దార్