
‘థైరాయిడ్’పై నిర్లక్ష్యం చేయొద్దు..
● అవగాహనతోనే ఆరోగ్యం ● పరీక్షలు తప్పనిసరి
నేడు వరల్డ్ థైరాయిడ్ డే
కరకగూడెం: థైరాయిడ్ మానవ శరీరంలోని మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీర జీవక్రియ (మెటబాలిజం) నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయి. అంటే శరీరం శక్తిని ఎలా ఉపయోగిస్తుంది, ఉష్ణోగ్రతను ఎలా నియంత్రిస్తుంది, గుండె, మెదడు, కండరాల వంటి ముఖ్యమైన అవయవాలు ఎలా పనిచేస్తాయి అనే వాటిని ఈ హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా మే 25న ‘వరల్డ్ థైరాయిడ్ డే’ను జరుపుకుంటారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
రకాలు.. లక్షణాలు..
థైరాయిడ్‌లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్‌థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. ఇంకా థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ కేన్సర్ ఉన్నాయి. అలసట, బరువు పెరగడం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు. బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.
కారణాలు..
థైరాయిడ్ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్‌లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ లేదా కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపుతో వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం లేదా ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం లేదా అధికంగా తీసుకున్నా దీని బారిన పడతారు.
నివారణ, చికిత్స
థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్యపరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోథైరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, హైపర్‌థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, లేదా శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ కేన్సర్ ఉన్నవారికి శస్త్రచికిత్స, కీమోథెరపీ లేదా రేడియేషన్ అవసరం కావొచ్చు. సరైన చికిత్సతో థైరాయిడ్ సమస్యలను నియంత్రించవచ్చు.
ముఖ్యంగా మహిళల్లో..
మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత లేదా రుతుక్రమం ఆగిన తర్వాత (మెనోపాజ్) ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి లు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం మాతా, శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
నిర్లక్ష్యం చేయొద్దు
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో థైరాయిడ్ పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నా యి. ప్రభుత్వం థైరాయిడ్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. థైరాయిడ్ సమస్యలను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. థైరాయిడ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.
–ఎల్.భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌ఓ

‘థైరాయిడ్’పై నిర్లక్ష్యం చేయొద్దు..