
‘సీతారామ’ గ్రామసభ వాయిదా..
● అధికారుల వాహనాల ఎదుట గిరిజనుల బైఠాయింపు ● రామన్నగూడెంలో ఘటన
అశ్వారావుపేటరూరల్: సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కింద నిర్మించే కాల్వలకు సంబంధించిన భూసేకరణ కోసం నిర్వహించే గ్రామసభను గిరిజనులు అడ్డుకొని, అధికారుల వాహనాల ఎదుట బైఠాయించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని కన్నాయిగూడెం, నారాయణపురం, వేదాంతపుర, అనంతారం గ్రామాల్లో భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించారు. కానీ, రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల బృందం వాహనాలను స్థానిక గిరిజనులు అడ్డుకుని, వాటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఊట్లపల్లి వద్దగల వెంకమ్మ చెరువు వరద కాల్వ నిర్మాణానికి సంబంధించి 2008లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు 60 మంది రైతులకు చెందిన 40 ఎకరాల సాగు భూమిని సేకరించారని, 17 ఏళ్లు అయినా పరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మళ్లీ సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణాలకు భూసేకరణ ఏవిధంగా చేస్తారని, వెంకమ్మ వరద కాల్వ పరిహారాన్ని 2013 చట్ట ప్రకారం ఇస్తేనే సహకరిస్తామనన్నారు. దీంతో రెండు గంటలకుపైగా అధికారులను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎస్‌ఐ యయాతి రాజు సిబ్బందితో అక్కడి చేరుకొని వారికి నచ్చజెప్పేందుకు యత్నించగా వారు ససేమిరా అన్నారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు రైతులను తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని స్థానిక డీటీ రామకృష్ణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామసభను వాయిదా వేసి, అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు.