
తనిఖీకొస్తే తంటాలే..!
తనిఖీల పేరుతో పంచాయతీరాజ్ శాఖలో ఓ సబ్ డివిజన్ స్థాయి అధికారి వ్యవహారశైలి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం.. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచడం, ఆ తర్వాత తన కోరికల చిట్టాను బయటపెట్టడం.. కాదంటే ‘నీ పని ఖతం’ అంటూ కన్నెర్ర చేయడం ఆ అధికారి నైజం కావడమే ఇందుకు కారణం.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
రికార్డుల పరిశీలన పేరుతో ఓ అధికారి హంగామా
● ప్రత్యేక భోజనం.. ‘స్పెషల్ కవర్’ ఇవ్వాలని డిమాండ్
● ఆ అధికారి తనిఖీలంటేనే వణుకుతున్న సెక్రటరీలు
● తిరుగుబాటుకు సిద్ధమవుతున్న పంచాయతీ కార్యదర్శులు
తనిఖీల పేరుతో దందా..
పంచాయతీరాజ్ విభాగంలో ఓ ఉన్నత స్థాయి అధికారి తనిఖీల పేరుతో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూ పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నివురుగప్పిన నిప్పులా మారింది. సదరు అధికారి ఏ గ్రామానికి పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నాడో.. ఆ సమాచారాన్ని ముందుగానే పంచాయతీ కార్యదర్శులకు చేరవేస్తారు. తాను వచ్చిపోయేందుకు వీలుగా కారులో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయడానికి రూ.3,000 ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. తనిఖీలు పూర్తయ్యాక లంచ్ లేదా డిన్నర్‌లో నాటుకోడి పులుసు, చేపల ఫ్రై కచ్చితంగా ఉండాల్సిందే. భోజనం చేసి కారు ఎక్కేటప్పుడు కనీసం రూ.10,000 నగదుతో కూడిన కవరు అందజేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ చిన్న మార్పు జరిగినా సదరు అధికారికి చిర్రెత్తుకొస్తుంది. ‘నీ పని తీరు బాగా లేదని రిపోర్టు రాస్తా’నంటూ బుసలు కొడతాడు. నిర్దేశిత షెడ్యూల్ తప్పినందుకు జరిమానాతో సహా ముడుపులు చెల్లిస్తే తప్ప సదరు అధికారి శాంతించడు.
నిబంధనల పేరుతో బెదిరింపులు..
పల్లె పరిపాలన ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఇందులో రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటిప్పుడు అప్‌లోడ్ చేయాలి. ఈ యాప్‌లో వివరాలు సరిగా నమోదు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత సబ్ డివిజనల్ స్థాయి అధికారులది. ప్రతీ నెల కనీసం 16 గ్రామాలకు వెళ్లి యాప్ పనితీరును పరిశీలించాలి. దీన్ని ఓ అధికారి అక్రమార్జనకు, గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి ఆయుధంగా ఉపయోగిస్తున్నాడని పంచాయతీరాజ్ శాఖ కోడై కూస్తోంది.
తప్పులెంచుతూ.. తన పని కానిస్తూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఇంటి పన్ను వసూలు ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయం సమకూర్చుకుంటాయి. ఇంటి పన్నుల ద్వారా వచ్చిన నిధులను ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. గ్రామ పరిపాలనకు ఖర్చు చేసిన మొత్తాలను బిల్లుల రూపంలో ట్రెజరీలో సమర్పిస్తే అక్కడి నుంచి చెక్కుల రూపంలో విడుదలవుతాయి. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర సర్కారు సైతం నిధుల మంజూరులో జాప్యం చేస్తోంది. ట్రెజరీలో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. కానీ పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగించే ట్రాక్టర్, వీధి దీపాలకు డబ్బులు అత్యవసరం అవుతున్నాయి. అంతేకాక గ్రామసభలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతీయ పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం అప్పటికప్పుడు డబ్బులు అవసరం పడుతున్నాయి. దీంతో ఇంటి పన్నుల ద్వారా వసూలైన డబ్బును తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీ ద్వారా కాకుండా నేరుగా ఖర్చు పెట్టక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఇతర సబ్ డివిజన్లలోనూ అనధికారికంగా ఇదే జరుగుతోంది. అలాగే గ్రామ పరిపాలనకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మొత్తం 72 రకాల రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రోజు, వారం, పక్షం, నెలరోజుల వారీగా వివరాలు నమోదు చేయాల్సిన రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డుల నిర్వహణలో సహజంగానే కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ సదరు అధికారి క్షేత్రస్థాయి పర్యటనలో రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగంలో పారదర్శకత లేదంటూ లోపాలను ఎంచుతూ పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డ్యూటీ ఎలా చేయాలనే అంశంపై ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచుతున్నాడు. చివరకు తన కారుకు ఫుల్‌ట్యాంక్, నాటుకోడి, ఫిష్‌ఫ్రై, రూ.10,000 కవర్ సమర్పిస్తే అంతా ‘రైట్’ అంటూ వెళ్లిపోతున్నాడు.
ఇక భరించలేం..
నిధులు మంజూరు కాక పంచాయతీల నిర్వహణ కోసం ఇప్పటికే రూ.లక్షల అప్పులు తెచ్చామని, సదరు అధికారి తీరుతో మరింత ఒత్తిడికి లోనవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఒక్కసారి తనిఖీ అంటే ‘మానేజ్’ చేయగలరు కానీ పదే పదే కొందరినే టార్గెట్ చేస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. దీంతో సదరు అధికారిపై రేపో మాపో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం, లేదంటే ఏసీబీని ఆశ్రయించాలనే ఆలోచనలో బాధితులు ఉన్నట్లు సమాచారం.