
‘సీతారామ’లో పూడిక తీయాలి
● జూన్ 15లోగా ప్రధాన కాలువ పూడిక పనులు పూర్తి చేయాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ములకలపల్లి/దమ్మపేట/అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ)లో నిర్మించిన 100 కి.మీ. ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడిక (సిల్ట్)తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేఽశించారు. శుక్రవారం ఆయన ములకలపల్లి మండలంలోని మెయిన్ కెనాల్‌పై 48.30 కి.మీ. వద్ద కూలిన పాసేజ్ పిల్లర్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. భూమి పొరల్లో మార్పుల వల్ల పిల్లర్ నేలమట్టమయిందని సీఈ శ్రీనివాస రెడ్డి మంత్రికి విన్నవించారు. అనంతరం రామచంద్రాపురం శివారులో ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెనను సందర్శించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో నిర్మాణ దశలో ఉన్న సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్, కాలువ, ప్రాజెక్ట్ మ్యాప్‌ను పరిశీలించారు. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు పంచాయతీ అన్నదైవం రెవెన్యూ పరిధిలో తొమ్మిదో ప్యాకేజీ రూ. 357 కోట్లతో నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు. కాలువ లైనింగ్, ట్రాప్ అక్విడెక్ట్ నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సూపర్ పాసేజ్‌కు ప్రమాదం వాటిల్లకుండా సపోర్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత ఏజెన్సీలతోనే మళ్లీ పిల్లర్ నిర్మించాలని చెప్పారు.
కాలువల్లో జమ్మి, మట్టి తొలగించాలి
నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కాలువల్లో జమ్మి , మట్టి తొలగించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో జూన్ 15లోగా పూడిక పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరిలో నీటిమట్టం పెరిగేలోగా మెయిన్ కెనాల్ శుభ్రం చేయాలన్నారు. మరో నాలుగు నెలల్లో జిల్లా వ్యవసాయ రంగానికి సీతారామ ప్రాజెక్ట్ కాలువ ద్వారా గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతోందని పలువురు రైతులు విన్నవించగా, సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు శ్రీనివాసరెడ్డి, విద్యాచందన, దామోదర్ రెడ్డి, మధు, సురేష్, కృష్జార్జునరావు, రాంబాబు, సతీష్, గుడ్ల పుల్లారావు, గద్దె రేవతి, కాంగ్రెస్ నాయకులు తాండ్ర ప్రభాకర్‌రావు, పర్వతనేని అమర్‌నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, బాల అప్పారావు, గాడి తిరుపతిరెడ్డి, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ పాల్గొన్నారు.