
యువకుడి మృతదేహం వెలికితీత
జూలూరుపాడు: పూడ్చి పెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన ఘటన మంగళవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు ఎస్సీకాలనీకి చెందిన కత్తి రాములు, నాగమణి దంపతుల కుమారుడు కత్తి అరవింద్ (26) ఇటీవల మృతి చెందగా.. మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ స్వాతిబిందు సమక్షంలో జేసీబీ సాయంతో సమాధి తొలగించి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ నిపుణులు రమణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. ఐదు నెలల కిందట అరవింద్‌కు ఏన్కూర్‌కు చెందిన సింధుతో వివాహమైంది. గత నెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిన సింధు అత్తగారింటికి వచ్చింది. ఏప్రిల్ 2న ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తిన్న అరవింద్ విరేచనాలు, వాంతలు కావడంతో ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. 7వ తేదీన అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజుల అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. కాగా, ఈ నెల 4న మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీసి, తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సీహెచ్ ఆదినారాయణ, పంచాయతీ సెక్రటరీలు హరిబాబు, లక్ష్మణ్, పోలీసులు పాల్గొన్నారు.