క్రీడలు లేని ప్రాంగణాలు | - | Sakshi
Sakshi News home page

క్రీడలు లేని ప్రాంగణాలు

Apr 25 2025 12:22 AM | Updated on Apr 25 2025 12:22 AM

క్రీడ

క్రీడలు లేని ప్రాంగణాలు

లక్ష్యానికి దూరంగా క్రీడా ప్రాంగణాలు
● పంచాయతీలకే పరిమితమైన క్రీడా కిట్లు ● జిల్లాలో 730 ప్రాంగణాలకు కిట్లు పంపిణీ ● వేసవి దృష్ట్యా వినియోగంలోకి తెస్తే మేలు

చుంచుపల్లి: గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు సమయంలో అధికారులు చూపిన ఉత్సాహం, వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో చూపకపోవడంతో మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో ప్రాంగణానికి క్రీడా సామగ్రిని పంపిణీ చేసినా వాటిని బయటకు తీసి ఆటలు ఆడిన దాఖలాలు ఎక్కడా లేవు. గత ప్రభుత్వం 2022లో అనువైన స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. యువకులు ఆటలాడేందుకు ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌ జంప్‌ కోర్టులను ఏర్పాటు చేయించడమే కాకుండా, కోచ్‌ల ద్వారా యువత, చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. కానీ, క్షేత్రస్థాయిలో క్రీడా ప్రాంగణాల లక్ష్యం ఆచరణకు ఆమడ దూరంలోనే ఆగిపోయింది. జిల్లాలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్లుగా చెత్తా చెదారం పేరుకుపోయి ఆదరణకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన ఐరన్‌ సామగ్రి దొంగల పాలైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని క్రీడా పరికరాలను తెలంగాణ క్రీడాశాఖ ద్వారా హడావుడిగా పంపిణీ చేసింది. క్రికెట్‌, ఖో–ఖో, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, స్కిప్పింగ్‌తో పాటు పలురకాల పరికరాలను గ్రామ పంచాయతీలకు అందజేసింది. వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా ఓ గదిలో మూలకు పడేశారు. అధికారులు క్రీడా పాంగాణాల్లో సరైన వసతులు కల్పించి, ఆట పరికరాలను వినియోగంలోకి తేవాలని యువకులు కోరుతున్నారు.

అలంకారప్రాయంగా ప్రాంగణాలు

గ్రామాల పారిధిలో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండటంతో శ్మశానవాటికల పక్కన, పాఠశాలల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్ది పాటి స్థలాల్లో తెలంగాణ ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్‌ కోర్టు, వ్యాయామం చేసేందుకు రెండు పరికరాలు ఏర్పాటు చేసి నామ్‌కేవాస్తేగా వదిలేశారు. కొన్ని చోట్ల కేవలం క్రీడా ప్రాంగణం పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను మరిచారు. ఇక పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగా స్థలం కొరత వల్ల నాలుగైదు వార్డులకు కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేశారు. సరైన వసతులు కల్పించకపోవడంతో యువకులు, క్రీడాకారులు ఆటలు ఆడేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. అటు గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. మరోవైపు నిధుల కొరత వల్ల పంచాయతీలు వీటి నిర్వాహణ చేపట్టలేక పూర్తిగా గాలికొదిలేశాయని పలువురు అంటున్నారు.

అటకెక్కిన క్రీడా సామగ్రి

జిల్లాలో పలు క్రీడా ప్రాంగణాలకు 2023 అక్టోబర్‌లో 730 కిట్లను పంపిణీ చేశారు. ముందుగా మండల కేంద్రాలు, మున్సిపాలిటీలకు సరఫరా చేయగా అక్కడి నుంచి అధికారులు గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఒక్కొక్క క్రీడా యూనిట్‌ విలువ రూ.63 వేలు. ఇందులో జిమ్‌ పరికరాలతో పాటు క్రికెట్‌, వాలీబాల్‌ ఆటలకు సంబంధించిన సామగ్రి ఉంది. కిట్లతో పూర్తిస్థాయిలో ఆటలాడిన దాఖలాలే లేవు. అటు పంపిణీ చేసిన క్రీడా కిట్లు చాలా చోట్ల వినియోగంలో లేక గ్రామ పంచాయతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటికైనా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఈ క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేకపోవడంతో అవి ఏళ్లుగా ఆదరణకు నోచుకోవడం లేదు. వీటిపై పర్యవేక్షణ కొరవడటంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా అధికారులు చొరవ తీసుకొని ప్రాంగణాలను వినియోగంలోకి తేస్తే యువతకు మేలు జరుగుతుంది.

–మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి

పంచాయతీ కార్యదర్శులకు

ఆదేశాలిస్తాం

గ్రామీణ ప్రాంతాల్లో యువకుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కొంత నిర్లక్ష్యానికి గురువుతున్న మాట వాస్తవమే. గ్రామ పంచాయతీల ఆధ్వర్యలో వీటి నిర్వహణను చేపట్టాల్సి ఉంది. కొన్ని నెలలుగా నిధుల కొరతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. వినియోగంలోకి తేవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం.

–వి.చంద్రమౌళి, డీపీఓ

క్రీడలు లేని ప్రాంగణాలు 1
1/2

క్రీడలు లేని ప్రాంగణాలు

క్రీడలు లేని ప్రాంగణాలు 2
2/2

క్రీడలు లేని ప్రాంగణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement