
పెసలు.. ధర లేక దిగాలు
● ఉమ్మడి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట సాగు ● ప్రభుత్వ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం ● క్వింటాకు రూ.2,500 మేర నష్టపోతున్న రైతులు
ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో రైతులు సాగు చేసిన పెసర పంటకు కనీస మద్దతు ధర కరువైంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించినా ఎక్కడా అది అమలు కావడం లేదు. పెసర పంట ప్రస్తుతం చేతికందుతుండగా, కొందరు రైతులు విక్రయిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటకు వ్యాపారులు గురువారం గరిష్టంగా రూ.7,050 ధర నిర్ణయించగా, మోడల్ ధర రూ.6,200, కనిష్ట ధర రూ.4 వేలే అందుతోంది. జెండాపాట ధర గరిష్ట ధర ఖరారు చేస్తున్నప్పటికీ.. ఎక్కువ పంటను మోడల్, కనిష్ట ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది.
దిగుబడి అంతంతే..
ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి పంటగా 10 వేల ఎకరాల్లో పెసర సాగు చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఎక్కువ మంది మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పెసర విస్తీర్ణం తగ్గింది. నీటి తడులు సమృద్ధిగా అందించిన చోట ఎకరాకు 5 – 6 క్వింటాళ్లు, మిగతా ప్రాంతాల్లో 2 – 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దిగుబడి తగ్గిన నేపథ్యాన ధర అయినా మెరుగ్గా ఉంటుందని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
డిమాండ్ ఉన్నా తక్కువ ధర
పెసల కొనుగోళ్లలో వ్యాపారుల ఇష్టారాజ్యం కొసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.8,682 మద్దతు ధర నిర్ణయించినా ఆ ధర రైతులకు లభించటం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ ధర దక్కే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పంట నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు చెల్లిస్తుండగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.700 నుంచి రూ.7,300 వరకు ధర పలుకుతోంది. దిగుబడి తగ్గిన నేపథ్యాన పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు లేక..
పంట నాణ్యతగా ఉండడం.. డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారుల తీరుతో క్వింటాకు రూ.2,500 వరకు రైతులు నష్టపోతున్నారు. నాణ్యత లేని పంటకు రూ.3,700కు మించి చెల్లించడంలేదు. పెసల విక్రయాలు ప్రారంభమై, రైతులు దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు నాఫెడ్ సహకారంతో మార్క్‌ఫెడ్ పెసలను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏదీ లేనట్లు తెలుస్తుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.