
ధీమా ఇవ్వని బీమా
● ఆరేళ్లుగా అడ్రస్ లేని పశువుల బీమా పథకం ● పాడి రైతులకు కరువైన భరోసా ● పునరుద్ధరించాలని వేడుకోలు
బూర్గంపాడు: పశువుల బీమా పథకం పత్తా లేకుండా పోయింది. కంటికి రెప్పలా కాపాడుకునే పశువులకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తించే పరిస్థితి లేదు. గతంలో పశువుల బీమాను ప్రోత్సహించిన ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పశువులను పోషించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఊతమిచ్చాయి. రైతులు కొంత సొమ్ము చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ప్రమాదవశాత్తు పశువులు మృతిచెందితే యజమానులకు బీమా సొమ్ము అందడం ద్వారా ఆర్థిక భరోసా దక్కేది.
భారీగా పెరిగిన ధరలు..
పశు పోషణ రోజురోజుకూ కష్టంగా మారుతోంది. పశు సంపద తగ్గిపోతున్న తరుణంలో ఆవులు, గేదెల ధరలు నింగినంటుతున్నాయి. మేలు రకం జాతి పశువుల ధర రూ. లక్షల్లో ఉంటుండగా.. మాంసానికి డిమాండ్ ఉండడంతో మేకలు, గొర్రెల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పశువులు, జీవాలకు బీమా చేయించేందుకు రైతులు ఆరాట పడుతున్నారు. అవి మేతకు వెళ్లినప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రతీ సంవత్సరం విద్యుదాఘాతం, పిడుగుపాట్లతో వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రోడ్లపై గుర్తు తెలియని వాహనాలు ఢీకొని కూడా పశువులు మృతి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల బీమా అమలు చేయాలని రైతులు, యజమానులు కోరుతున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు మేలు జాతి పశువులకు బీమా చేస్తున్నా.. ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బీమా చేయించలేకపోతున్నారు. ప్రభుత్వం కొంత, రైతులు కొంత చెల్లించే అవకాశం ఉంటే ఎక్కువ మంది బీమా చేయించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.
అటకెక్కిన పథకం..
2017 – 18 వరకు పశువుల బీమా పథకం పూర్తిస్థాయిలో కాకున్నా అక్కడక్కడా అమలయ్యేది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఈ పథకం అటకెక్కింది. పశువులు మృతి చెందితే రూ.లక్షల్లో నష్టపోతున్నామని, ఇకనైనా పాలకులు స్పందించి పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
బీమా అమలు చేయాలి
పశువుల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ప్రైవేటుగా బీమా చేయాలంటే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. బీమా చేయకుంటే ఏదైనా ప్రమాదం జరిగి పశువులు చనిపోతే ఒక్క రూపాయి కూడా చేతికి రావడం లేదు.
– నిమ్మల రాములు, రైతు,
నాగినేనిప్రోలు
ప్రభుత్వానికి నివేదిస్తున్నాం
పశువుల బీమా పథకం అమలు చేయాలంటూ చాలా మంది రైతులు అడుగుతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కోసం కొంత బడ్జెట్‌ను ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించేవి. గత ఆరేళ్లుగా బీమా పథకం పూర్తిగా నిలిచిపోయింది. రైతుల వినతులను ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.
– డాక్టర్ పురంధర్,
జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి
జిల్లాలో పశు సంపద వివరాలిలా
ఆవులు, ఎద్దులు : 2,00,844
గేదెలు : 1,25,587
గొర్రెలు : 1,55,406
మేకలు : 2,00,462
పందులు: 1,964
మొత్తం :6,84,263