
అన్నదాతకు ‘అకాల’ దెబ్బ
● జిల్లాలో ఇటీవల రోజూ కురుస్తున్న వర్షం ● కల్లాల్లోనే తడుస్తున్న ధాన్యం ● వరికోతలకూ ఆటంకం
బూర్గంపాడు: అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ముమర్మంగా వరికోతలు, ధాన్యం అమ్మకాల సమయంలో కురుస్తున్న వానలు కలవరపరుస్తున్నాయి. గాలి దుమారంతో కోతకు వచ్చిన వరి నేలకొరుగుతోంది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. గత పది రోజులుగా జిల్లాలో ఏదో ఓ ప్రాంతంలో గాలిదుమారంతో కూడిన వర్షాలు పడుతుండగా పంటలు పాడవుతున్నాయి. మంగళవారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు, అశ్వాపురం, గుండాల మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షం కురవగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేసి టార్పాలిన్లు, పరదాలు కప్పుతూ కొంతమేర కాపాడుకునే ప్రయత్నం చేశారు.
నత్తనడకన కొనుగోళ్లు..
జిల్లాలో పలువురు రైతులు ఇప్పటికే ధాన్యం కోసినా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేయడం, ఉదయం ఆరబెట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. బూర్గంపాడు మండలంలో పలుచోట్ల రాశుల కిందకు వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. దీన్ని తిరిగి ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరో రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు,
వ్యాపారులు..
అకాల వర్షాలతో వరి పొలాలు బురదమయంగా మారాయి. దీంతో పంట కోసేందుకు రైతులు ట్రాక్‌బెల్ట్‌తో నడిచే హార్వెస్టర్ల కోసం పోటీ పడుతున్నారు. గంటకు రూ. 3,500 చొప్పున చెల్లించి వరి కోతలు చేపడుతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టడం కూడా కష్టం అవుతుండడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం వేచిచూడకుండా తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన సన్నరకం ధాన్యానికి కూడా ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించినా.. రైతులు అవేవీ పట్టించుకోకుండా ఏదో ఒక ధరకు అమ్ముకోవాలని చూస్తుండగా.. ఇదే అదనుగా వ్యాపారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

అన్నదాతకు ‘అకాల’ దెబ్బ