భద్రాచలం: అర్హులైన ప్రతీ గిరిజనుడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌కు హాజరైన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వారి వినతులను యూనిట్ అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అర్హులైన గిరిజన కుటుంబాలకు విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నాణ్యమైన క్రీడా సామగ్రి పంపిణీ చేయాలి
టెండర్ నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైన క్రీడా సామగ్రి, దుస్తులు సరఫరా చేయాలని పీఓ టెండర్‌దారులకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ క్రీడా పాఠశాలలకు సరఫరా చేసే టీ షర్ట్, షార్ట్, ట్రాక్ షూట్ క్రీడా సామగ్రి టెండర్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. టెండర్ సమయంలో చూపిన శాంపిల్ ప్రకారమే సరఫరా చేయాలని, కోచ్‌లు, ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి లైసెన్స్‌లు రద్దు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గిరిజన మ్యూజియంలో పనులు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాలల్లో ఐటీడీఏ ఏపీఓ జనరల్ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ ఉదయభాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, ఏపీఓ వేణు, లక్ష్మీనారాయణ, సమ్మయ్య, ఆదినారాయణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
ఆశ్రమ పాఠశాలలో తనిఖీ..
ములకలపల్లి : మండల పరిఽధిలోని కమలాపురం ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ను పీఓ రాహుల్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. హాస్టల్‌లోని మొదటి అంతస్తు గదిలో షార్ట్‌సర్క్యూట్‌తో క్రీడా వస్తువులు, పాత పరుపులు దగ్దమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఓ హాస్టల్‌ను సందర్శించి ఘటన వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.