దమ్మపేట: కుటుంబ సభ్యులు మందలించడంతో మద్యం మత్తులో ఓ యువకుడు శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పార్కలగండి గ్రామానికి చెందిన కొండ్రు శివ(19) మద్యానికి బానిసగా మారడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంటి పైకప్పు ఊచకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో కిందకు దింపి చూడగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి సీతారాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
గోదావరిలో దూకి మరొకరు..
భద్రాచలంఅర్బన్: పట్టణంలో బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం సరిహద్దున ఉన్న ఎటపాక గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈ నెల 20న ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి అదే రోజు రాత్రి బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్పించారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు వివరాలతో కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా అనిల్ భార్య పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మతిస్థిమితం కోల్పోయాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బావిలో విషం.. చేపలు మృతి
నేలకొండపల్లి: మండలంలోని మోటాపురం (బీల్యాతండా) గ్రామానికి చెందిన భూక్యా వీరు అనే రైతు తన వ్యవసాయ బావిలో గతేడాది క్రితం చేప పిల్లలు పోశాడు. ప్రస్తుతం అవి ఒక్కోటి సుమారు 2 కిలోల వరకు పెరిగాయి. మరో రెండు, మూడు రోజుల్లో చేపలు పట్టి విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బావిలో పురుగుల మందు కలపగా చేపలు మొత్తం ఆదివారం మృత్యువాత పడ్డాయని, దాదాపు రూ. లక్ష మేర నష్టపోయానని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మల్లారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కుమారుడు ఈసం విజయ్ గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ పని చేస్తునానడు. ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సెల్ టవర్ వద్ద అగ్నిప్రమాదం
బూర్గంపాడు: నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని సెల్ టవర్ వద్ద ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెల్ టవర్ పక్కన ఉన్న పంటచేలలోని వ్యర్థాలను కాలుస్తున్న క్రమంలో మంటలు టవర్ వరకు వ్యాపించాయి. మంటలు అంటుకుని టవర్ ఫైబర్ కేబుల్స్ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో వచ్చిన భద్రాచలం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా కేబుల్స్ కాలిపోవటంతో స్నిగల్స్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.