
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రియాంక ఆల
సూపర్‌బజార్(కొత్తగూడెం): వేసవి సెలవులు ముగిసే వరకు జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎంపికై న అన్ని పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో పని చేయించే విధానంపై సోమవారం ఆమె కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మంజూరైన పనులు బుధవారం ప్రాంభించి మే నెలాఖరు వరకు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో తమకు అందజేయాలని అన్నారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించాలని సూచించారు. ప్రతీ పనిని మొదలు పెట్టే ముందు, పూర్తయిన తరువాత ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జాతీయ బ్యాంకులలో కమిటీల ఖాతాలు ప్రారంభించాలని చెప్పారు. ప్రతిరోజు పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ విద్యాచందన, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ వెంకటేశ్వరాచారి, ఆర్‌అండ్‌బీ డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ డీఈ రవికుమార్, మెప్మా డీఈ రాజేష్, సెర్ప్ డీపీఎం నాగజ్యోతి పాల్గొన్నారు.