వైభవంగా ధ్వజారోహణం | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

Published Tue, Mar 28 2023 11:56 PM

ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న అర్చకులు ఽ(ఇన్‌సెట్‌) ధ్వజస్తంభంపై గరుత్మంతుని చిత్రం - Sakshi

● భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ ● నేడు ఎదుర్కోలు ఉత్సవం ● రేపు శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో మంగళవారం ధ్వజారోహణం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన జరిపి, కర్మణ, పుణ్యావాచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్ఠాపన జరిపారు.

గరుడ ప్రసాదం పంపిణీ

సంతానం లేని వారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందచేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు గరుడ ప్రసా దం ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం యాగశాలలో బేరీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవి, ఏఈఓలు శ్రవణ్‌ కుమార్‌, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఎదుర్కోలు ఉత్సవం

బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. కల్యాణం ముందు రోజు స్వామి వారికి జరిగే ‘ఎదుర్కోలు ఉత్సవం’ ప్రత్యేకం. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రికి పెండ్లి సందర్భంగా వారివారి వంశాల గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ఈవేడుక భక్తులకు కనువిందుగా ఉంటుంది. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. ఇక గురువారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 31న పుష్కర పట్టాభిషేకం వేడుకలు మిథిలా స్టేడియంలో జరగనున్నాయి.

భక్తులకు గరుడ ముద్దలు అందిస్తున్న అర్చకులు
1/1

భక్తులకు గరుడ ముద్దలు అందిస్తున్న అర్చకులు

Advertisement

తప్పక చదవండి

Advertisement