డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: దసరా సెలవుల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పర్యాటకులు పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకునే పోలీస్ శాఖ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తోందని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. తీర ప్రాంతాల్లో వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు జిల్లాకు వస్తారన్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సూర్యలంక, వాడరేవు, రామాపురం సముద్రతీర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సముద్రతీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పర్యాటకుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏటీవీ (ఆల్–టెర్రైన్ వెహికల్స్)తో పోలీస్ సిబ్బంది సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌తో పర్యాటకులకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు. సముద్రంలో ప్రమాదకరమైన లోతు ఉన్న ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా హెచ్చరిక జెండాలను ఏర్పాటు చేశామన్నారు. నిర్దేశించిన పరిమితిని దాటి సముద్రంలోకి వెళ్లకుండా పర్యాటకులను అప్రమత్తం చేసేందుకు బోట్ల ద్వారా గస్తీ నిర్వహించాలన్నారు. పర్యాటకులు అనుకోని ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణమే రక్షించేందుకు లైఫ్ బాయ్‌లు, లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉండే పోలీస్ సిబ్బందిని సముద్రతీర ప్రాంతాల్లో నియమించామన్నారు.


