బాపట్లటౌన్: సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న నలుగురు యువకులను స్థానిక మత్స్యకారులు కాపాడారు. గుంటూరులోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన కె.ధనుష్‌కుమార్, బి.సంతోష్, గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన బి.అభిషేక్, కె.వినయ్, లక్ష్మీపురానికి చెందిన ఎల్.పునిత్ సముద్రస్నానాల నిమిత్తం శనివారం ఉదయం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వీరిలో నలుగురు యువకులు కేకలు వేస్తూ నీటిలో కొట్టుకుపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వంశీ, కనకరాజులు వెంటనే సముద్రంలోకి దూకి కొట్టుకుపోతున్న యువకులను కాపాడి తీరానికి చేర్చారు. వీరిలో ఇద్దరు యువకులు అప్పటికే సముద్రనీరు తాగడంతో వీరికి తీరం వెంబడి సీపీఆర్ నిర్వహించి చికిత్స నిమిత్తం ఆటోలో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం తీరానికి వచ్చిన ఐదుగురు యువకులు సురక్షితంగానే ఉన్నారు.
అందుబాటులో లేని
సిబ్బంది, గజ ఈతగాళ్లు
యువకులు తీరంలో కొట్టుకుపోతున్న సమయంలో తీరంలో అవుట్‌పోస్ట్, మైరెన్ సిబ్బంది అందుబాటులో లేరు. కనీసం తీరంలో గస్తీ నిర్వహించే గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో లేరు. తీరం వెంబడి అద్దెకు గొడుగులు ఏర్పాటుచేసుకుంటూ జీవనం సాగించే ఇద్దరు యువకులు తీరంలో నలుగురు కొట్టుకుపోవడాన్ని గమనించి మత్స్యకారులకు చెప్పడంతో నీటిలోకి దూకి కాపాడారు. మత్స్యకారులు సకాలంలో స్పందించి ఉండకపోతే యువకులు మృత్యువాత పడేవారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


