తెనాలి: పాల రైతులను, పాడి పరిశ్రమను రక్షించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ కోరారు. పాల రైతుల సంఘం గుంటూరు జిల్లా ప్రథమ మహాసభను శుక్రవారం స్థానిక అయితానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య, సరస్వతమ్మ కల్యాణ మండపంలో నిర్వహించారు. సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి, పంటలు ప్రజల జీవనాధారమని, పాడి పరిశ్రమ కుంటుపడితే పౌష్టికాహారానికి దూరమయ్యే దుస్థితి నెలకొంటుందని స్పష్టంచేశారు. పాడి పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడితే పాల సేకరణ కేంద్రాలు, పాల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతుల సమస్యలపై డిమాండ్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభ ద్వారా జిల్లావ్యాప్త కమిటీలను, మండలాల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి, తద్వారా పాల, పాడి రైతుల సమస్యలపై భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాల ఉత్పత్తికీ, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. లీటరు పాలకు కనీస ధర రూ.100 ప్రకటించాలని, ప్రభుత్వం లీటరుకు రూ.5 ప్రోత్సాహక ధర అందించాలని డిమాండ్ చేశారు. వరి గడ్డితోపాటు పశువుల దాణాను 75 శాతం రాయితీతో సరఫరా చేయాలని కోరారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పశువులకు అవసరమైన పచ్చగడ్డి, ఇతర మేతను పొరుగు జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పశువైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతోపాటు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పాడి పరిశ్రమ పరిరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తొలుత అఖిల భారత కిసాన్‌న్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వేజెండ్ల తబిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్, తెనాలి కమిటీ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, పలువురు రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్


