కలుపుకోవాల్సిన ఖర్చు! | - | Sakshi
Sakshi News home page

కలుపుకోవాల్సిన ఖర్చు!

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

కలుపుతీత.. రైతు గుండెకోత

పెరిగిన ఖర్చులతో బెంబేలెత్తుతున్న రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా పొలాల్లో విపరీతంగా పెరిగిన కలుపు ఎకరాకు రూ.10వేల నుంచి 15 వేలు అదనంగా ఖర్చు పెడుతున్న రైతులు

ఎకరాకు రూ. 15 వేలు ఖర్చు

బాపట్లటౌన్‌: అన్నదాతలు ఈ ఏడాది ఏ ఘడియలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారో కానీ అన్ని నష్టాలే వెంటాడుతున్నాయి. నారుమడిలో విత్తనాలు చల్లినప్పటికీ ఇప్పటి వరకు నష్టాలు ఒకదాని వెంట మరోకటి వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ అసమర్ధత విధానాలతో మొన్నటి దాకా అదునులో కాలువలు రాక పెంచిన నారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అల్లాడిన రైతులు ప్రస్తుతం పొలాల్లో వచ్చిన కలుపు తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సకాలంలో పొలాలు దుక్కిదున్ని కాలువల ద్వారా సాగునీరు వస్తే పొలానికి సరిపడా నీటిని పెట్టి నాట్లు వేసిన వెంటనే కలుపు మందు వేస్తే కలుపు చాలా వరకు అరికట్టగలిగేవారు. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఎకరం కలుపు తీయాలంటే రూ. 10 నుంచి 15 వేలు మేరా ఖర్చుచేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వ మొద్దునిద్ర ఫలితం..

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులపై రైతులను ముందే హెచ్చరించాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకుండా.. మొద్దునిద్ర పోవడంతో రైతులు నాట్లు వేశారు.. మరికొంత మంది వెద పద్ధతిలో సాగు చేశారు. ప్రభుత్వ అసమర్థతో సకాలంలో కాలువలకు సాగునీరు రాలేదు. సెప్టెంబర్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలకు రైతులు చేసేది లేక హడావుడిగా రోటావేటర్‌, గొర్రులతో ఒకటి, రెండు సార్లు దుక్కిదున్ని నాట్లువేశారు. హడావుడిగా దుక్కిదున్నడం, పొలాల్లో నీళ్లు అదేవిధంగా ఉండటంతో పొలంతోపాటు కలుపుకూడా విపరీతంగా పెరిగింది. దీనిని తీసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ముందుగా వెద పద్ధతిలో సాగుచేసిన పొలాల్లో కూడా నీళ్లు లేకపోవడంతో కలుపు గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా వచ్చింది. వరిపొలాల్లో కలుపు విపరీతంగా పెరగడంతో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది.

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన వెంటనే కాలువలకు సక్రమంగా నీరు వచ్చి ఉంటే సకాలంలో నాట్లు వేసుకుంటే ఎకరాకు రూ. 300 నుంచి 600 కలుపు మందుతో కలుపును నివారించుకునేవాళ్లు. ప్రస్తుతం పొలానికంటే కలుపు మొక్కలే ఎక్కువుగా ఉండటంతో ఎకరాకు కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 40 మంది వరకు కూలీలు అవసరం అవుతున్నారు. దీనికి తోడు గతంలో రోజువారీ కూలీలకు ఒక్కొక్కరికి రూ. 300 ఉండేది. ప్రస్తుతం 500 కు పెరిగింది. పెరిగిన ఖర్చులతో ఎకరాకు కనీసం 25 మంది కూలీలకు గానూ 10 వేలు ఖర్చు అవుతుంది. అసలు నీటి సౌకర్యం లేని పొలాల్లో అయితే ఎకరాకు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకున్న రైతులు వ్యవసాయం చేయాలంటేనే జంకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement