బాపట్ల: ప్రతి గృహ వినియోగదారుడు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని వినియోగించుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథక ప్రచార వాల్‌పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా మార్చి 2027 నాటికి దేశంలో ఒక కోటి గృహాలకు సోలార్ రూఫ్ టాప్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 58 లక్షలకు పైగా గృహాలపై ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ పథకానికి బ్యాంకుల ద్వారా సులభంగా రుణ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతం వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. ఈ సోలార్ ప్యానల్ వాడకం ద్వారా విద్యుత్‌ను గృహ అవసరాలకు వినియోగించుకుని అదనపు విద్యుత్‌ను గ్రిడ్లకు అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి గృహ వినియోగదారుడు అందిపుచ్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఏపీ సీపీడీసీఎల్ ఎస్‌ఈ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


