బాపట్ల: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్‌లో నిర్మించిన ఆధునిక భవన సముదాయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించనున్నారు. అదే సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వినూత్నంగా చేపట్టిన ‘‘ఇన్నోవేటివ్ ఫార్మర్స్ నెట్‌వర్క్’’ కార్యక్రమాన్ని కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో మంత్రి ప్రారంభించనున్నారు.
నగరంపాలెం: ఏపీలో డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు ఉత్తర సబ్‌డివిజన్ డీఎస్పీ సీహెచ్.మురళీకృష్ణను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగపు డీఎస్పీగా, సీఐడీ డీఎస్పీ కొమ్మనబొయిన వెంకటేశ్వర్లును గుంటూరు ఉత్తర సబ్‌డివిజన్ డీఎస్పీగా నియమితు లయ్యారు.
తెనాలి: రాష్ట్రంలోని ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు దసరా సెలవుల్లో నిర్వహించనున్న స్పెషల్ ‘టెట్‘ పరీక్షలను వాయిదావేసి, దసరా సెలవుల అనంతరం నిర్వహించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బట్టు వెంకయ్య రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ గడువును ఆరు నెలలకు తగ్గించాలని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘ఈఎస్‌ఆర్’ సబ్మిషన్ గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఆయన కోరారు.
తాడికొండ: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామపంచాయతీ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఏపీ07టీజీ1762 నంబరు గల ఆటో శాఖమూరు నుంచి వస్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడి రిజర్వాయర్‌లోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి గాయాలు కావడంతో, వెంటనే 108 అంబులెనన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన విలాసారపు మోహన్‌రావు(60)ను వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
గుణదల(విజయవాడ తూర్పు): ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరుకు చెందిన పెమ్మసాని బాబురావు(56) కొంత కాలంగా ఉద్యోగం నిమిత్తం విజయవాడ మొగల్రాజపురం బోయపాటి మాధవరావు వీధిలో ఓ అద్దె ఇంటిలో ఉంటున్నాడు. అతని కుటుంబ సభ్యులు గుంటూరులోనే ఉంటున్నారు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాబురావు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత పని నిమిత్తం ఆ ఇంటి యజమాని బాబురావును కలిసేందుకు తలుపు తట్టాడు. ఎంతకీ అతను తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని కిటికీలోంచి చూడగా బాబురావు ఉరి వేలాడుతూ కన్పించాడు. ఇంటి యజమాని మాచవరం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్య ఫిర్యాదుతో టూటౌన్‌లో కేసు
నరసరావుపేట టౌన్: రైల్వే టీసీ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సురేంద్రబాబు ఆదివారం తెలిపారు. బరంపేటకు చెందిన క్షత్రి కుస్వత్‌సింగ్ గుంటూరు రైల్వే స్టేషన్‌లో టీసీగా పనిచేస్తుంటాడు. గత నెల 30వ తేదీ డ్యూటీ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి విధులు ముగించుకున్న తర్వాత ఇంటికి రాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా గాలించినా ఫలితం దక్కలేదు. సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జూలై 2వ తేదీ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ధనుశ్రీతో కుస్వత్‌సింగ్‌కు వివాహమైంది. ఈ క్రమంలో అదృశ్యం అవ్వటంపై పోలీసులు కుటుంబ కలహాలు ఏమో నన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


