సినీ నటుడు మురళీమోహన్‌కు జీవన సాఫల్య పురస్కారం ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు సమష్టి కృషి అవసరం దశాబ్ది వేడుకల్లో సినీ ప్రముఖులు
మంగళగిరిరూరల్: ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ పదో వార్షికోత్సవం ఆదివారం మండలం పరిధి ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహన కృష్ణ అధ్యక్షత వహించారు. తెలుగు చలనచిత్ర రంగానికి దశాబ్దాలుగా విశేష సేవలందించిన సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్‌్‌కు ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం అందజేసి సత్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బలమైన సినీ వాతావరణం ఏర్పడేందుకు ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. సినీ నటి లయ మాట్లాడుతూ ఏపీలోని స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ఫిలిం చాంబర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ఏపీలోని ప్రకృతి అందాలు సినిమా చిత్రీకరణలకు అనువైనవని పేర్కొన్నారు. జో శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని సంస్కృతి, సహజ లొకేషన్లు సరికొత్త కథలకు స్ఫూర్తినిస్తాయని వివరించారు. సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు, రాయితీలు కల్పిస్తే మరింత మంది నిర్మాతలు ఏపీకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సినీ రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నందున షూటింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సూచించారు. ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పి.భరత్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సినీ పరిశ్రమకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. చాంబర్ అధ్యక్షుడు అంబటి మాట్లాడుతూ ఏపీలో షూటింగ్‌లు చేయండి.. మీ అభివృద్ధికి బాటలు వేయండి అనే నినాదంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నామని తెలిపారు. కమిటీ కుర్రాళ్లు, లిటిల్ హార్ట్స్, 35–చిన్న కథ కాదు చిత్రాల దర్శకులకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం, లఘు చిత్రాల విజేతలతోపాటు సీనియర్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను సత్కరించారు.


