నగరంలో సరకుల పంపిణీలో ఇబ్బందులు
15 రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ సమస్యలు
పడిగాపులు కాసి వెళ్లిపోయిన కార్డుదారులు
గుంటూరు వెస్ట్: పేదలకు రేషన్ సకాలంలో అందక ఇబ్బందులకు గురయ్యారు. బహిరంగ మార్కెట్‌లో కేజీ బియ్యం ధర రూ.70కి పైగా పలుకుతుండడంతో చాలా మంది ఈ బియ్యంపైనే ఆధారపడుతున్నారు. అయితే ఒకటో తేదీ నుంచి జిల్లాలో ఉన్న 5,90,546 రేషన్ కార్డుదారులకు 972 దుకాణాల ద్వారా బియ్యంతోపాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా అందించాల్సిన బాధ్యత సివిల్ సప్లైస్ అధికారులపై ఉంది. గుంటూరు పట్టణంలో కొరిటెపాడు, సాకేత్‌నగర్, శారదా కాలనీతోపాటు పాత గుంటూరు ప్రాంతంలోనూ పంపిణీ వ్యవస్థ స్తంభించింది. కేవలం గుంటూరులోనే 15 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ మూడు రోజుల నుంచి జరగలేదు. కార్డుదారులు దుకాణాలకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. కనీసం సమాధానం చెప్పేందుకు కూడా ఎవ్వరూ లేరని వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్యూఆర్ కోడ్‌తోనే సమస్య
రేషన్ మాఫియాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ప్రతి బియ్యం బస్తాపైనా క్యూఆర్ కోడ్‌తో ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరవేస్తారు. అక్కడ వాటిని నమోదు చేసుకుని రేషన్ దుకాణానికి పంపిస్తారు. ఇక్కడ మళ్లీ రేషన్ దుకాణదారుడు ఈ–పాస్ మిషన్‌లో వాటిని నమోదు చేయాలి. మొత్తం నమోదు చేసిన తర్వాత ఒక్కసారి 5 బస్తాలు తీసి, అవి అయిపోయిన తర్వాత మళ్లీ మరో ఐదు బస్తాల చొప్పున పంపిణీ చేయాలి. అయితే ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి వచ్చిన క్యూఆర్ కోడ్ బస్తాలు సాంకేతిక లోపంతో రేషన్ దుకాణాల్లో నమోదు కావడం లేదు. దీంతో పంపిణీ వ్యవస్థ కొంతవరకు స్తంభించింది.


