అర్ధరాత్రి యువకుడిపై అమానుషం! | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి యువకుడిపై అమానుషం!

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

అరండల్‌పేటలో పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుడిని చితకబాదిన ఓ ప్రైవేటు డ్రైవరు, పోలీసులు

స్వయంగా పీఎస్‌కు వచ్చి కొట్టించిన టీడీపీకి చెందిన ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీఏ

స్టేషన్‌ నుంచి బయటకు వదలడానికీ డబ్బులు డిమాండ్‌

ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సమాయత్తం

లక్ష్మీపురం: యువకుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసిన ఘటనలో పోలీసులు స్థానిక టీడీపీ నేతల ప్రోదల్బంతో బాధితుడినే చితకబాదిన ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పండుగ సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన వినాయక పందిరి వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అరండల్‌పేటలోని ఓ బడ్డీ కొట్టు వద్దకు తూర్పు నియోజక వర్గానికి చెందిన కొందరు యువకులు ఆగారు. ఆ బడ్డీ కొట్టులో ఉండే వ్యక్తితో ముచ్చటిస్తున్న సమయంలో కొంతమంది మద్యం మత్తులో ఉన్న యువకులు వచ్చి వారితో అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఇది సరికాదని చెప్పడంతో ఒక యువకుడిని మద్యం సేవించి ఉన్న వారు తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. దీంతో బాధిత యువకుడు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ వద్దకు ఫిర్యాదు నిమిత్తం వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్నారు. సదరు యువకులు ఓ టీడీపీ నేతకు చెందిన అనుచరులం అని తెలపడంతో అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ప్రైవేట్‌ డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి ఫైబర్‌ స్టిక్‌ తీసుకుని స్టేషన్‌లోపల బాధిత యువకుడిని లాఠీతో కొట్టి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం ప్రారంభించాడని బాధితులు వాపోయారు. గాయపడి స్టేషన్‌కు వస్తే ఫిర్యాదు తీసుకోకుండా తనను ఇలా కొట్టడం సరికాదని చెప్పడంతో స్టేషన్‌లో ప్రైవేట్‌ డ్రైవర్‌తో పాటు కానిస్టేబుల్‌ సైతం ఇద్దరు కలిసి కింద పడేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. ఇదంతా ఒక ఎత్తయితే మద్యం మత్తులో ఉన్న యువకులకు మద్దతుగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (పీఏ) స్టేషన్‌ వద్దకు నేరుగా వచ్చి మద్యం తాగి దాడి చేసిన వారికి వత్తాసు పలికారు. ఆ పీఏని మళ్లీ మచ్చిక చేసుకునే క్రమంలో ఆ ప్రైవేట్‌ డ్రైవర్‌, కానిస్టేబుల్‌ ఇద్దరు కలిసి మళ్లీ బాధితుడిని సెల్‌లో పడేసి లాఠీతో కొట్టారు. బాధితుడి స్నేహితులు వచ్చి ఎంత ప్రాధేయపడినా ప్రైవేట్‌ డ్రైవర్‌ వదల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే స్టేషన్‌ బయట కాచుకుని ఉన్న తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు యువకులు సదరు టీడీపీ నేత అండ చూసుకుని సినిమా స్టయిల్‌లో ఆ యువకుడిపై మళ్లీ స్టేషన్‌ బయట దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఇప్పుడు పెట్టుకోరా కేసు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారని బాధితులు వాపోయారు. బాధిత యువకులు పోలీసులకు ఎంత చెప్పినా వినకపోగా గాయపడిన వారిని తెల్లవారు జామున 4 గంటల వరకు స్టేషన్‌లో ఉంచారు.

వదిలేందుకు డబ్బులు డిమాండ్‌!

ఇదిలా ఉండగా.. బాధితుడితో పాటు అతని స్నేహితులను బయటకు పంపించేందుకు ఓ పోలీస్‌ అధికారి డబ్బులు డిమాండ్‌ చేసి, తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాయాలపాలైన సదరు యువకుడు అక్కడ నుంచి స్నేహితుల సహాయంతో జీజీహెచ్‌లో చికిత్స కోసం చేరాడు. పోలీస్‌ స్టేషన్‌లో ప్రైవేట్‌ డ్రైవర్‌ చేస్తున్న అరాచకంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ బయటకు వచ్చిన తరువాత కూడా తమవారిపై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని బాధిత యువకుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహరం అంతా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు బాధితులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement